VARLA COMPLAINT:పోలీసులు కొట్టడం వల్ల మరణించిన.. నెల్లూరు దళిత యువకుడు నారాయణ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేత వర్ల రామయ్య జాతీయ మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై రాష్ట్రాన్ని మానవ హక్కుల ఉల్లంఘనల కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. అధికార పార్టీపై అసమ్మతి తెలిపితే వైకాపా నాయకులు పోలీసుల సహకారంతో అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. తాజాగా కందమూరులో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు.
గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ వస్తువులు దొంగిలించాడనే ఆరోపణలతో.. పోలీసులు నారాయణను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురి చేశారని వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ శరీరంపై దెబ్బలు స్పష్టంగా ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక తెలుపుతోందన్నారు. నారాయణ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.