ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఎంఐఎం సహా ఎవరితోనూ పొత్తు లేదని.. ఒంటరిగానే పోటీ చేస్తున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని.. మేయర్ పీఠంపై తెరాస అభ్యర్థే ఉంటారని స్పష్టం చేశారు. హైదరాబాద్​లో అరాచకం కావాలా... అభివృద్ధి కావాలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. హైదరాబాద్​లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమని... ఉక్కుపాదంతో అణిచివేస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

By

Published : Nov 19, 2020, 5:44 PM IST

trs had no alliance with anyone in ghmc elections says ktr
హైదరాబాద్​లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్

తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఎవరితోనూ పొత్తు లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఒంటరిగానే 150 డివిజన్లలో పోటీ చేస్తామని చెప్పారు. గ్రేటర్ పీఠం ఎంఐఎంకి ఇస్తారన్న పిచ్చి ప్రచారంలో నిజం లేదన్న కేటీఆర్... మేయర్ కుర్చీలో తెరాస అభ్యర్థే కూర్చుకుంటారని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఎంఐఎంపై ఐదు స్థానాల్లో గెలిచామని.. ఈసారి మరో ఐదారింట్లో విజయం సాధిస్తామని మంత్రి అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్​లో మంత్రి కేటీఆర్ వివిధ అంశాలపై స్పందించారు.

అరాచకం కావాలా? అభివృద్ధి కావాలా?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండోస్థానం కాంగ్రెస్​దా... భాజపాదా అనేది వారే తేల్చుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగురేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. గోల్కొండపై కాషాయ, కషాయ జెండాలు ఎగురవేయరని... అక్కడ కేసీఆర్ ఎప్పుడో జాతీయ జెండా ఎగురవేశారన్నారు. హైదరాబాద్​లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని.. ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. కొందరు విద్వేషపు విత్తనాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్​ దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా సహించేది లేదని స్పష్టం చేశారు. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఊరుకోబోమన్నారు. హైదరాబాద్​లో అరాచకం కావాలో.. అభివృద్ధి కావాలో విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ కోరారు.

సాయంపై మోదీ స్పందించలేదు

వరద బాధితులకు సాయం పంపిణీ చేయవద్దన్న ఎన్నికల సంఘం ఆదేశాలను గౌరవిస్తాం. బాధితులందరికీ ఎన్నికలయ్యాక సాయం అందుతుంది. మీ సేవా కేంద్రాల వద్ద ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. అయితే దరఖాస్తుల కోసం బారులు తీరడం.. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న గౌరవానికి సంకేతం. కాంగ్రెసో, భాజపో ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం వరద సాయాన్ని నిలిపివేసింది. వరద బాధితులకు పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టాం. దాని కోసం రూ.650 కోట్లు కేటాయించాం. వరద సాయం కోసం సీఎం లేఖ రాసి ఆరు వారాలైనప్పటికీ కేంద్రం స్పందించడం లేదు. కర్ణాటక, గుజరాత్​కు మాత్రం ఆగమేఘాలపై నిధులు పంపించారు. వరదలు, కరోనా పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉన్నాం. ఉత్తమ్ కుమార్, బండి సంజయ్ వంటి నాయకులు ఎక్కడా కనిపించలేదు.

-కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

కేసీఆర్​ వ్యూహంతోనే దిగుతారు

హైదరాబాద్​కు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కటైనా భాజపా నేతలు చెప్పాలని కేటీఆర్ అన్నారు. కేంద్రం ఓ మిథ్య అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారన్నారు. సీఎం కేసీఆర్​ ప్రజల పక్షపాతి అని ఎల్ఆర్ఎస్​పై ఏ నిర్ణయమైనా ఆయనే తీసుకుంటారని.. భాజపా కాదని కేటీఆర్ పేర్కొన్నారు. తెరాస ఎవరికీ బీ టీం కాదని.. తెలంగాణ ప్రజల ఏ టీం అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఏది చేసినా వ్యూహంతోనే దిగుతారని.. డిసెంబరులో జరగనున్న భాజపా వ్యతిరేక పార్టీల సమావేశంపై ఏం జరుగుతుందో వేచి చూద్దామని కేటీఆర్ పేర్కొన్నారు.

సంతృప్తిగా ఉన్నా

గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో విజయానికి పార్టీ కార్యకర్తలందరూ కష్టపడ్డారని... ప్రస్తుత పదవులతో తాను సంతోషంగా ఉన్నానని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఇంకా స్పష్టత రాలేదన్న కేటీఆర్.. తాను మాత్రం ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్​లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్

ఇదీ చదవండి :ఆసరా, చేయూత కింద పాడి పశువుల పంపిణీ: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details