Bharat Biotech Nasal Vaccine: భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న చుక్కల మందు టీకా (బీబీవి154/నాసల్ వ్యాక్సిన్) పై మూడో దశ క్లినికల్ పరీక్షలు ఈ వారంలో ప్రారంభం కానున్నాయి. దిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సహా దేశవ్యాప్తంగా 9 ప్రదేశాల్లో ఈ పరీక్షలు చేపట్టేందుకు భారత్ బయోటెక్ వర్గాలు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 5 వేల మంది వాలంటీర్లు ఇందులో భాగస్వాములు అవుతారని అంచనా. ఈ పరీక్షలకు భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి అనుమతి వచ్చిన విషయం విదితమే.
ఇప్పటికే రెండు డోసుల కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారికి బూస్టర్ డోసు కింద చుక్కల మందు టీకా ఇస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే అంశాన్ని కూడా మూడో దశ క్లినికల్ పరీక్షల్లో భాగంగా అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. ఈ టీకా ఇవ్వడంలో ఉన్న ప్రయోజనాలు, రవాణా, నిల్వ సులువు కావడం వల్ల చుక్కల మందు టీకా కోసం వివిధ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.