పార్టీని వేదికగా వినియోగించుకుని కష్టకాలంలో వదిలి వెళ్లి పోయేవారిని తిరిగిరానిచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కష్టపడ్డాం.. కార్యకర్తలకు సరైన సమయం కేటాయించలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహానాడు రెండో రోజున ‘తెలుగుదేశం- సంస్థాగత నిర్మాణం’ అనే అంశంపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీర్మానం ప్రవేశపెట్టగా.. పార్టీ నేతలు జ్యోతుల నెహ్రూ, గౌతు శిరీష, సోమిశెట్టి వెంకటేశ్వర్లు బలపరిచారు.
ఎమ్మెల్యేల రాజ్యం: చినరాజప్ప
తెదేపా అధికారంలో ఉన్న సమయంలో.. ఒక్కో నియోజకవర్గం ఒక్కో ఎమ్మెల్యే రాజ్యంగా తయారైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పలేకపోయాం. ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగింది. ఎన్నికల్లో వారు మౌనంగా ఉండిపోవటంతో ఓటమిపాలయ్యాం. జగన్ అందర్నీ నమ్మించేలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. పార్టీ తరపున గెలిచి వైకాపాలోకి వెళ్లిన గిరి, వంశీ, బలరామ్ ఎక్కడా కన్పించడం లేదు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు ఎందుకు నిర్వహించలేకపోతున్నాం? అయిదేళ్లపాటు పదవులు అనుభవించిన నేతలు పార్టీ తరపున ఎంపీటీసీ, కౌన్సిలర్‌నైనా నిలబెట్టలేరా?
వాళ్లనే చేర్చుకుంటారని భయం: శిరీష
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి.. కష్టకాలంలో పోతున్నారు. అలాంటివారిని మళ్లీ చేర్చుకుంటారని భయపడుతున్నాం. ఈ విషయాన్ని ప్రస్తావించాలని సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు నాకు సూచించారు. నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు. కష్టనష్టాలెదురైనా పార్టీకి అండగా ఉంటున్నది కేడర్ మాత్రమే. సరైన శిక్షణ ఇస్తే మంచి నాయకులు తయారవుతారు. తెలంగాణలో అధికారం సాగిస్తున్న నాయకులు తెలుగుదేశంలో శిక్షణ పొందిన వారే కదా.