రాష్ట్రంలో పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ఏర్పాటు చేసిన సుజాతారావు కమిటీ... ప్రభుత్వానికి కీలకమైన సూచనలు చేసింది. ఆరోగ్య రంగంలో కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి జగన్‌కు మధ్యంతర నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన నిపుణల బృందం... 108 సర్వీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 440 వాహనాలు ఏడేళ్లకు పైబడి పనిచేస్తున్నాయని, కేవలం రోగులను, క్షతగాత్రులను, ఆస్పత్రులకు తరలించే రవాణా సాధనాలుగా మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నాయని...ఆలోగా వారికి కావాల్సిన ప్రాథమిక చికిత్స అందడంలేదని నిపుణుల కమిటీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. సిబ్బందికి ఇచ్చే శిక్షణలోనూ నాణ్యత లేదని తేల్చి చెప్పింది. కొత్త వాహనాల కొనుగోలు, అధికంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లు, ఆధునికీకరణ తదితర అంశాలపై కీలక సూచనలు చేసింది.104 వాహనాల పరిస్థితిపైనా, సేవలపైనకూడా కమిటీ అనేక వాస్తవ విషయాలను వెలుగులోకి తీసుకు వచ్చింది. మందుల సరఫరాలో లోపాలు ఉన్నాయని, ఆడిట్ కూడా సరిగ్గాలేదని కమిటీ మధ్యంతర నివేదికలో పేర్కొంది. ఇక్కడ సౌకర్యాలు మెరుగుపడేంత వరకూ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలకు అనుమతించాలని కమిటీ సూచించింది.
పీపీపీలను పునఃసమీక్షించాలి: సంస్కరణల కమిటీ - cm
వైద్య ఆరోగ్య శాఖ ఐదేళ్లలో కుదుర్చుకున్న ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందాలను(పీపీపీ) పునఃసమీక్షించాలని సంస్కరణల కమిటీ సూచించింది. దీనికి సంబంధిన వివరాలను తుది నివేదికలో పొంద పరుస్తామని వెల్లడించింది.
నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్ వారికి సూచనలు చేశారు. మరింత లోతుగా అధ్యయనం చేసి ఆగస్టు 30 లోగా తుది నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రజలకు కంటి పరీక్షలు, హెల్త్‌కార్డుల జారీపై ఒక కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వేయి రూపాయిలు దాటితే ఆరోగ్యశ్రీకింద ఉచితంగా వైద్యం చేయిస్తామంటూ హామీ ఇచ్చామని, దీనికి అవసరమైన విధివిధానాలనుకూడా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరోగ్యశ్రీకింద ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో తనిఖీలతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల మెరుగుకోసం కార్యాచరణ సిద్ధంచేయాలన్నారు.