TAHDIGADAPA MUNICIPALITY : ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి.. ముఖ్యమంత్రి జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టుకోవడం, ఆ చర్యను ఆయన, మంత్రులు సమర్థించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టానుసారం పేర్లు మార్చేయడానికి ఇదేమైనా వారి జాగీరా? రేపు మరో ప్రభుత్వం వచ్చి.. మళ్లీ పేరు మారుస్తామంటే.. యూనివర్సిటీ అస్తిత్వానికి ఇబ్బంది తలెత్తదా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
మహానుభావుల్ని, గొప్ప వ్యక్తుల్ని, జాతీయ నాయకుల్ని గౌరవించుకునే పద్ధతి ఇదేనా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక. విఖ్యాత నటుడు. విలక్షణ పాలకుడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా.. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు పక్కా గృహాలు, జనతా వస్త్రాల్లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బడుగు బలహీనవర్గాలకు రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తిహక్కు లాంటి విప్లవాత్మక సంస్కరణల్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి. అనేక ప్రముఖ విద్యా సంస్థల్ని ఏర్పాటుచేసి నవశకానికి నాంది పలికారు.
హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆయన హయాంలో ఏర్పాటు చేసినవే. వైద్య విద్యకు దేశంలోనే తొలిసారి ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌దే. అందుకే ఆయన గౌరవార్థం యూనివర్సిటీకి అప్పటి ప్రభుత్వం ఆయన పేరు పెట్టింది. అలాంటి వ్యక్తి పేరు మార్చడాన్ని వైకాపా తప్ప మిగతా అన్ని పార్టీలు, వివిధ సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. కొందరు వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులూ ఆంతర్గత చర్చల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
పాత పేర్లు పాయే వైఎస్సార్ పేరు వచ్చే: వైకాపా అధికారంలోకి వచ్చాక పాత పథకాలు, ప్రాజెక్టుల పేర్లన్నీ మార్చేసి వైఎస్సార్, జగన్ పేర్లు పెడుతున్నారు. ‘ఆ పథకాలేమైనా జగన్ సొంత డబ్బుతో అమలు చేస్తున్నారా? ఇష్టానుసారం పేర్లు పెట్టడానికి రాష్ట్రమేమైనా వారి జాగీరా?’ అని వివిధ పార్టీల నాయకులు ధ్వజమెత్తుతున్నారు. విజయవాడలో భాగంగా ఉన్న తాడిగడప పంచాయతీని జగన్ ప్రభుత్వం ప్రత్యేక మున్సిపాలిటీగా చేసి దానికి ‘వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ’ అని పేరు పెట్టింది. ‘దేశంలో ఏ మున్సిపాలిటీకీ వ్యక్తుల పేర్లు ఉండవు. ఈ సంప్రదాయం వైఎస్ పేరుతోనే మొదలైంది’ అని తెదేపా నాయకులు దుయ్యబడుతున్నారు.
కడప జిల్లాకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్‌ఆర్ కడప అని పేరు పెట్టింది. జగన్ మాత్రం కడప అనే పేరు తీసేసి కేవలం వైయస్‌ఆర్ జిల్లాగా మార్చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ‘వైయస్‌ఆర్ ప్రదేశ్’ అని పేరు పెట్టినా ఆశ్చర్యం లేదని సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు సరి కదా.. దాన్ని ఆర్థికంగా కుంగదీసింది. దాని నిధులు రూ.400 కోట్లు లాగేసుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ పేరునూ తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాల దృక్పథం ఉండాలి కదా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా ప్రభుత్వ హయాంలో అనేక స్టేడియాలు, పార్కుల నిర్మాణం జరిగింది. వాటికి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకుల పేర్లు పెట్టింది. జూబ్లీహిల్స్‌లో జాతీయ పార్కుకు కాసు బ్రహ్మానందరెడ్డి పేరు.. యూసుఫ్‌గూడలోని స్టేడియానికి కోట్ల విజయభాస్కరరెడ్డి పేరు, మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి మర్రి చెన్నారెడ్డి పేర్లు పెట్టారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.
తెలంగాణలో వైఎస్ పేరు తొలగించలేదుగా?