STUDENT SUICIDE: విజయవాడలోని భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలికకు న్యాయం చేయాలని. తెదేపా మహిళా నేతలు డిమాండ్ చేశారు. బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన నేతలు.. ఈ ఘటనపై మండిపడ్డారు. ఆపార్ట్‌మెంట్‌లో ఉండే వ్యక్తి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని, దీనికి కారణమైన వ్యక్తిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు: ఏసీపీ
కుమ్మరి పాలెం బాలిక ఆత్మహత్య కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న తొమ్మిదో తరగతి బాలిక రెండున్నర నెలలుగా వినోద్ అనే వ్యక్తి నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నట్లు సూసైడ్ నోట్లో మృతిచెందిన బాలిక తెలిపిందని ఆయన వివరించారు. సీసీ టీవీ ఫుటేజ్ సూసైడ్ నోట్ లోని వివరాలు పరిశీలించి విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాలిక నివాసముంటున్న అపార్ట్ మెంట్ లోనే పై అంతస్తులో వినోద్ ఉంటారని ఏసీపీ తెలిపారు. ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.