ఎయిడెడ్ విలీనాన్ని వ్యతిరేకించిన విద్యార్థులపై పోలీసుల జులం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ అన్నారు. డీజీపీ సవాంగ్ చదివింది ఐపీఎస్సేనా అని అనుమానం కలుగుతోందని అన్నారు.
స్థానిక ఎన్నికల్లో గెలుపుకోసం వైకాపా అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు. సీఎం జగన్.. పన్నుల భారంతో ప్రజల నడ్డివిరగకొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తున్నారని అన్నారు.
"పోలవరం పూర్తి చేయలేని జగన్ రెడ్డికి నీటిపై పన్ను వేసే హక్కుఎక్కడిది. చెత్త పన్ను, ఆస్తిపన్ను, మరుగుదొడ్లపై పన్నుతో ప్రజల్ని పీక్కుతింటున్నారు. ప్రజలు ఈ మాఫియా ప్రభుత్వానికి త్వరలో చరమగీతం పాడనున్నారు." -తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
చంద్రబాబు దిల్లీ పర్యటన తర్వాత వైకాపా నేతలకు ఏటా రూ.8వేల కోట్ల అక్రమ సంపాదనకు బ్రేక్ పడిందని మాజీమంత్రి జవహర్ దుయ్యబట్టారు. వారం రోజుల్లో ఎస్ఈబీ 10టన్నుల గంజాయి పట్టుకున్నట్లు మీడియా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు దిల్లీ పర్యటనకు వెళ్లకముందు ఏటా రూ.8వేల కోట్ల గంజాయిని అక్రమ సంపాదన కోసం పోలీసులు ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. 3ఏళ్ల నుంచి ఆ మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్లిందని నిలదీశారు.
ఆపరేషన్ పరివర్తన్ ఎవరికోసమో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. 25.10.2021కి ముందు ఆపరేషన్ పరివర్తన్ ఎందుకు చేపట్టలేదని, పరివర్తన్ ను కేవలం 500ఎకరాలకే పరిమితం చేస్తే కుదరదన్నారు. ఏపీలో గంజాయి ఉందని చెప్పకనే చెప్తూ ప్రతిపక్షాలకు నోటీసులివ్వటం దుర్మార్గమని మండిపడ్డారు. గిరిజనులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కల్పించమంటే ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు.
ఇదీ చదవండి:AMARAVATHI FARMERS: మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై కేసులు!