రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకమే అమలు కానప్పుడు.. అందులో ఎన్ని రోగాలు చేర్చి ఏం ప్రయోజనమంటూ తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. 'అద్దె ఇంటికి వెళ్లిన ప్రతిసారీ గృహప్రవేశం'లా వైకాపా ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీని కొత్త పథకంలా చూపిస్తూ ప్రచారానికి అధిక ఖర్చు చేయటాన్ని తప్పుబట్టారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆ పథకాన్ని తాము అభివృద్ధి చేశామని తెలిపారు.
వైద్యారోగ్యానికి తెదేపా ప్రభుత్వం 2018-19లో రూ. 9వేల కోట్లు ఖర్చు చేస్తే.. వైకాపా ప్రభుత్వం ఇప్పుడు రూ. 7,400 కోట్లే కేటాయించిందని చెప్పారు. బడ్జెట్లో రూ. 11 వందల కోట్లంటూ అబద్ధపు కేటాయింపులు చూపి ప్రచారం చేసుకుంటోందని ధ్వజమెత్తారు. నేడు ఏ ప్రైవేటు ఆసుపత్రిలోనూ ఆరోగ్యశ్రీ అమలుకావడం లేదన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పడకలు సరిపోక కొవిడ్ రోగులు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదని ప్రశ్నించారు. కరోనా బాధితుల కోసం వసతులు పెంచితే ఆరోగ్యశ్రీని అమలుచేసినట్లేనని.. అంతేకానీ కొవిడ్‌ను పథకంలో చేర్చినంత మాత్రాన ఉపయోగం లేదన్నారు.