తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉపసభాపతి కోన రఘుపతితో సమావేశమయ్యారు. తెదేపా శాసనసభాపక్ష ఉపనేతలను అన్యాయంగా సస్పెండ్ చేశారని వారిపై వేటు ఎత్తివేయాలని కోరారు. ముగ్గురు ఉపనేతల సస్పెన్షన్‌పై తెదేపా ఎమ్మెల్యేలు నిరసన తెలియజేశారు. నిరసన తెలియజేయడం సభ్యుల హక్కు అన్న ఎమ్మెల్యేలు.. ఆ హక్కును కాలరాయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. సీనియర్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. నిమ్మల రామానాయుడిని బలవంతంగా మార్షల్స్ మోసుకుపోవడం అప్రజాస్వామికమంటూ మండిపడ్డారు.
'సస్పెన్షన్ ఎత్తివేయండి.. నిరసన తెలపడం మా హక్కు' - buchayya
ముగ్గురు తెదేపా నేతలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఉపసభాపతిని తెదేపా ఎమ్మెల్యేలు కోరారు... అధికారపక్షంతో సంప్రదించిన తర్వతా చెప్తానని కోన రఘుపతి వారికి సర్ధిచెప్పారు.
సభ నిర్వహణకు పూర్తి సహకారం అందించడానికి తాము సిద్ధంగా వున్నామని తెదేపా ఎమ్మెల్యేలు ఉపసభాపతికి స్పష్టం చేశారు. ముగ్గురు ఉపనేతల సస్పెన్షన్ ఈరోజు క్వశ్చన్ అవర్కే పరిమితం చేయాలని వారు కోరారు. సెషన్స్ మొత్తం సస్పెండ్ చేస్తే అందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల్లో తమ నాయకుడికి అవకాశం ఇవ్వాలని ఉపసభాపతి దృష్టికి తెదేపా ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు.అధికారపక్షంతో మాట్లాడిన అనంతరం సస్పెన్షన్‌పై స్పష్టతనిస్తానని ఉపసభాపతి తెదేపా ఎమ్మెల్యేలకు సర్దిచెప్పారు.
అనంతరం వైకాపా సభ్యులైన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో ఉపసభాపతి సమావేశమై.. సస్పెన్షన్ ఎత్తివేయాలన్న తెదేపా డిమాండ్‌ను వారి దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి తమ అభిప్రాయాన్ని చెబుతామని నేతలు తెలిపారు.