రోడ్ల మీద గుంతలు పూడ్చలేని వారికి రాజధాని నిర్మాణం వంటి పెద్ద మాటలెందుకని.. మంత్రి అవంతి శ్రీనివాస్‌ను ఉద్దేశించి తెదేపా (TDP) రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న(budda venkanna) విమర్శించారు. " అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామంటే వద్దన్నది ఎవరు. మూడు రాజధానులు, ముప్పై రాజధానులు అంటూ.. కాలక్షేపం చేయడం తప్పా ఏ ఊరిలోనైనా మూడు ఇటుకలు పెట్టారా. ఇతర కార్యక్రమంలో బిజీగా ఉన్న మంత్రికి విశాఖ అభివృద్ధి గుర్తుకు రావడం గొప్ప విషయమే. " అని ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.
తెలుగు భాషపై వైకాపా కుట్రపన్నింది: బీదా రవిచంద్ర యాదవ్
వైకాపా అధికారంలోకి వచ్చాక తెలుగు భాషపై కుట్రపన్నిందని తెదేపా నేత, ఎమ్మెల్సీ(MLC) బీదా రవిచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. "గత రెండేళ్లుగా ఆంగ్లం పేరుతో హడావుడి చేస్తూ.. తెలుగు భాషాభివృద్ధిని భ్రష్టు పట్టించారు. ఆంగ్ల మాధ్యమం పేరుతో నీతిమాలిన రాజకీయాలను వైకాపా నేతలు మానుకోవాలి. పాఠశాలల్లో మాతృభాషకు మంగళం పాడి ఆంగ్లాన్ని ప్రోత్సహించటాన్ని తప్పుబట్టిన కేంద్ర నివేదికలకు ఏం సమాధానం చెప్తారు. తెలుగు మీడియంతోపాటు ఆంగ్ల మాధ్యమానికి తెదేపా ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇచ్చింది. ఇంగ్లీష్‌పై అంత ప్రేముంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ విద్యా విధానాలను ఎందుకు నీరుగార్చారు..? తెలుగు సంస్కృతికి, తెలుగుదనానికి ఆలంబనగా నిలిచిన అమరావతిని నాశనం చేయటం దుర్మార్గం. తుగ్లక్ సర్కారు చర్యలతోనే విద్య పరంగా రాష్ట్రం.. దేశంలో 19వ స్థానానికి పడిపోయింది." అని ఎమ్మెల్సీ ఓ ప్రకటనలో దుయ్యబట్టారు.