రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాలకు అడ్డుపడుతూ... రాజ్యాంగాన్ని కాలరాస్తూ.. రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు పరిస్థితిని జగన్ స్వయంగా తెచ్చుకుంటున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదనే భయంతో సీఎం జగన్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని చెరబడుతున్నారని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
'గ్రామ స్వరాజ్యమనే గాంధీ సిద్ధాంతాన్ని, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిపాలనలో బలహీనవర్గాలకు భాగస్వామ్యం ఇవ్వాలనే అంబేడ్కర్ సిద్ధాంతాన్ని జగన్ ఖూనీ చేస్తున్నారు. తన ఫ్యాక్షన్ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికే మాయని మచ్చగా మారారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను ధిక్కరించడం కోర్టుధిక్కరణే. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి అధికారాలు ఉంటాయో.. రాష్ట్ర ఎన్నికల సంఘానికీ అవే అధికారాలు ఉంటాయని గతంలో శేషన్ హయాంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ సంగతి తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎస్‌ఈసీ ఆదేశాలను బేఖాతరు చేయడం కోర్టుధిక్కరణే కాదు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కూడా...' అని ఆయన దుయ్యబట్టారు.
ప్రజాతీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే తన ఆటలు సాగవని జగన్ భయపడుతున్నారని యనమల ఎద్దేవా చేశారు. 'నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే జగన్ పాలనపై అదొక రెఫరెండమవుతుంది. అందుకే ఏదోవిధంగా ఎన్నికలు వాయిదా వేయించాలని పన్నాగాలు వేస్తున్నారు. ఎస్‌ఈసీ ఆదేశాలను పాటించడం అధికార యంత్రాంగం బాధ్యత. 74, 75 రాజ్యాంగ సవరణలను నిర్లక్ష్యం చేస్తూ.. జగన్ రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడ్డారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 243కె(3) ప్రకారం ఎస్‌ఈసీకి కావాల్సిన ఉద్యోగులను ఎన్నికల విధులకు హాజరయ్యేలా చూడాలి. జగన్ రాజ్యాంగ, ప్రజా వ్యతిరేక చర్యలపై ప్రజలు మేల్కొనాలి. వైకాపా ఫాసిస్టు పాలనకు బుద్ధి చెప్పాలి.' అని యనమల పిలుపునిచ్చారు.
ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నారు
రాష్ట్రంలో నిరంకుశపాలన కొనసాగుతోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘సీఎం జగన్ ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగేలా ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నారు. వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రజాకోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని కళా హెచ్చరించారు.
కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలి