"వ్యాక్సిన్ సరఫరా చేయండి - ప్రాణాలు కాపాడండి" నినాదంతో తెదేపా నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. నేతలు తమ ఇళ్ల వద్దే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు కొనసాగించారు. నాయకత్వ లోపం, అనర్హులకు పదవలు ఇవ్వటం వల్లే ప్రస్తుత దుస్థితి ఏర్పడిందని పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 4 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 45 కోట్లతో 13 లక్షల వ్యాక్సిన్లను ఆర్డర్ పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజలకు కావాల్సింది తాయిలాలు కాదు టీకాలని స్పష్టం చేశారు.
కేంద్రంపై అసత్య ప్రచారం మానుకోండి..
ప్రశ్నించేవారిపై కేసులు ముఖ్యం కాదని.. కోవిడ్‌ను అరికట్టడంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకోవటం తగదని మరో పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు దుయ్యబట్టారు. చంద్రబాబు మంచి సలహాలు ఇస్తుంటే ఆయనపై కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ఆక్షేపించారు. వ్యాక్సిన్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని మరో మాజీమంత్రి జవహర్ ఆరోపించారు.
టీకా కొనుగోలుకు నిధులు కేటాయింపు ఎక్కడ..??
ప్రభుత్వం అందరికీ టీకా వేసి ప్రాణాలను కాపాడాలని గన్నవరం ఇంఛార్జ్ శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు. సీఎం నివాసం మరమ్మత్తులకు రూ. 40 కోట్ల కేటాయించి.. కరోనాకు రూ. 45 కోట్లను కేటాయించడంపై నిరసన వ్యక్తంచేశారు. ప్రజల ప్రాణాలను రక్షించాలని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు.