TDP ON YSRCP: "నిన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి.. నేడు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. జగన్ రెడ్డి ప్రాణాలకు హాని తలపెట్టొచ్చని వ్యాఖ్యానించడం మరో కోడికత్తి డ్రామా. బాత్రూమ్ బాబాయ్ గొడ్డలివేటు రిహార్సల్ లాగా అనిపిస్తోంది" అని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఓ వైపు అప్పులకుప్ప.. మరోవైపు తీవ్రమైన ప్రజావ్యతిరేకత నేపథ్యంలో.. మళ్లీ కోడికత్తికి సానబెడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. "అబ్బాయ్ గారూ.. ఈ సారి ఏ బాబాయ్‌కి గురిపెట్టారో?" అని ఎద్దేవా చేశారు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దూరంగా ఉంటున్నా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చెబుతోందన్నారు. బురద రాజకీయం మాని "హూ కిల్డ్ బాబాయ్" అనే ప్రశ్నకు వైకాపా నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ వ్యాఖ్యలు.. వైకాపాలో వర్గపోరుకి సంకేతం: బుద్ధ వెంకన్న
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి.. ఉత్త ముఖ్యమంత్రిగా మారి ఏదేదో మాట్లాడుతున్నాడని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. హత్యారాజకీయాలకు వైఎస్ కుటుంబమే పెట్టిందిపేరని.. అందులో భాగంగా జరిగినవే కోడికత్తి డ్రామా, బాబాయ్ గొడ్డలిపోటు అని అన్నారు. జగన్‌ను హతమార్చడానికి ఓ కులం ప్రయత్నిస్తోందన్న నారాయణస్వామి వ్యాఖ్యలు.. వైకాపాలోని వర్గపోరుకి సంకేతమన్నారు. అధికారపార్టీలోని వారే ముఖ్యమంత్రిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా..? ఎప్పుడు సీఎం కుర్చీ దక్కుతుందా? అని ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు.
పీకే (ప్రశాంత్ కిషోర్) ఆలోచనల ప్రకారమే వైకాపా నేతలు తెదేపాని ఓ కులానికి పరిమితంచేసే ప్రయత్నంచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడున్నా ఆయన పక్కన బీసీలు, ఎస్సీలు ఉంటారుగానీ ఆయన కులంవారు ఉండరని పేర్కొన్నారు. మీడియా సంస్థలపై, నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్నఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ వంటి వారిపై కక్షసాధింపులు మాని, ముఖ్యమంత్రి ఇంటిదొంగలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.
వారే వైకాపా ప్రభుత్వంలో కీలకస్థానాల్లో...
డిప్యూటీ సీఎం చెప్పిన కులంవారే.. ఇప్పుడు ఈప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నారు. వారుకూడా ముఖ్యమంత్రిని హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారా? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉస్కో అనగానే భౌ భౌమంటూ ఉరికొచ్చే వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ వంటి వాళ్లు కూడా నారాయణస్వామి చెప్పిన కుట్రలో భాగస్వాములా? అని నిలదీశారు. వైకాపా వాళ్లు ఇష్టమొచ్చినట్లు మొరుగుతుంటే.. చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి.. సింహాల్లా చీల్చి చెండాడుతామని హెచ్చరించారు.