రాష్ట్రవ్యాప్తంగా జగన్ రెడ్డి నిర్దేశకత్వంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను న్యాయపోరాటం ద్వారానే అడ్డుకోవాలని నిర్ణయించినట్లు తెదేపా మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రకృతి వనరుల దోపడీని యథేచ్ఛగా సాగిస్తున్న జగన్ ప్రభుత్వం.. మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. విశాఖ జిల్లాలోని అక్రమ బాక్సైట్ మైనింగ్, తూర్పుగోదావరిలోని అక్రమ గ్రావెల్ తవ్వకాలు, కృష్ణా జిల్లాలోని కొండపల్లి అక్రమ మైనింగ్, ఇతర జిల్లాల్లోని అక్రమ మైనింగ్లను ఎలాగైనా అడ్డుకొనే తీరుతామని స్పష్టం చేశారు. న్యాయస్థానాలు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, ఇతరత్రా మార్గాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ పెట్టడమే మా లక్ష్యమన్నారు. కొండపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారంపై తెదేపా గతంలో నియమించిన నిజనిర్థారణ కమిటీ.. ప్రభుత్వప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసిందన్నారు. చీఫ్ సెక్రటరీ తమ లేఖపై స్పందించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
సజ్జలకు యురేనియం కాలుష్యం కనిపించట్లేదా: మర్రెడ్డి
పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యమనే పెద్ద మాటలు వాడుతున్న సజ్జలకు పులివెందులలోని యురేనియం కర్మాగార కాలుష్యం కనిపించడం లేదా అని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి నిలదీశారు. తుమ్మలపల్లి యురేనియం కర్మాగారాన్ని ఎందుకు మూసేయకూడదని ఆగస్ట్ 2019లో నోటీసిచ్చిన జగన్ ప్రభుత్వం.. రెండేళ్లు గడిచినా చర్యలెందుకు తీసుకోలేదని నిలదీశారు. రెండేళ్లుగా ముఖ్యమంత్రి సొంతనియోజకవర్గంలోని ప్రజలు విషవాయువులు.. కాలుష్యనీటితో ప్రాణాలు కోల్పోతున్నా.. జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కర్మాగారం యజమానులు, ప్రభుత్వానికి మధ్య ఏం జరిగిందో గానీ, తుమ్మలపల్లి యురేనియం వ్యర్థాలకు వందలాది మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యమంటున్న సజ్జలకు తమ ఆరోగ్యం పట్టడం లేదా అని జగన్ నియోజకవర్గం వారే వాపోతున్నారని మర్రెడ్డి దుయ్యబట్టారు. తుమ్మలపల్లి యురేనియం వ్యర్థాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సజ్జల ఏంచెబుతారని నిలదీశారు.