కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో.. గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధరణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైకాపా వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఇది వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య బాహాబాహీకి దారితీయటంతో.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. వాహనం ధ్వంసంతోపాటు... పలువురు గాయపడేందుకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ.. వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. కారు అద్దం పగులగొట్టిమరీ పోలీసులు ఉమాను అరెస్టు చేసి..పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కొండపల్లి అటవీ ప్రాంతంలో.. అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆ ప్రాంతంలో పర్యటనకు వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అటవీ సంపద కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పరిశీలన అనంతరం తిరిగి వస్తుండగా.. గడ్డమణుగ గ్రామం వద్ద.. దేవినేని ఉమా వాహనంపై అకస్మాత్తుగా వైకాపా శ్రేణులు దాడికి దిగారు. పెద్దఎత్తున అల్లరి మూకలు రాళ్లు విసురుతూ అక్కడికి చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉమ కారుతోపాటు పలు వాహనాలు ఈ ఘర్షణలో ధ్వంసమయ్యాయి. అక్కడికి చేరుకున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు... వైకాపా శ్రేణులను ప్రతిఘటించటం బాహాబాహీకి దారితీసింది.
పోలీసులు అక్కడికి చేరుకుని... లాఠీఛార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. అక్కడి నుంచి ఉమా వాహనాన్ని పంపించేశారు. దాడికి దిగనవారిని పోలీసులు అరెస్టు చేయకపోవటంపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరును నిరసిస్తూ.. జి.కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద కారులోనే ఆందోళనకు దిగారు. ఉమాకు మద్దతుగా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున బయలుదేరిన తెలుగుదేశం కార్యకర్తలు, నేతలను... పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
తంగిరాల సౌమ్య, శ్రీరాంతాతయ్య, బుద్ధా వెంకన్న, కొణకళ్ల నారాయణను గృహనిర్బంధంలో ఉంచారు. జి.కొండురు పోలీసు స్టేషన్ కు బయలు దేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను మార్గమధ్యలో అడ్డుకున్న పోలీసులు ఆయనను వెనక్కి పంపించారు. స్టేషన్ వద్ద ఇరువర్గాలు పెద్దఎత్తున చేరుకోవటంతో.. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి లాఠీఛార్జి చేశారు.