వైకాపా అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పిన సీఎం జగన్ రూ. 30 వేలతో సరిపెడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా చేసిన శంకుస్థాపనలకే.. మళ్లీ భూమిపూజ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే విధానాన్ని ఎందుకు రద్దు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సామాన్యుడి సొంతింటి కల సాకారాన్ని దూరం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణ వ్యయానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీని తగ్గించే హక్కు ఎక్కడిదన్నారు. 365 చదరపు అడుగుల స్థలంలో నిర్మించే ఇళ్లలో ఎలాంటి సౌకర్యాలుంటాయంటూ మండిపడ్డారు. సెంటు పట్టాలు ఇప్పటివరకు ఎంతమందికి రిజిస్ట్రేషన్లు చేశారని నిలదీశారు. ఇళ్ల పట్టాల పంపిణీలో వైకాపా నేతలు రూ. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని నిరూపించేందుకు తెదేపా సిద్ధంగా ఉందన్నారు. జనావాసాలకు దూరంగా.. నివాసానికి ఎటువంటి సౌకర్యాలు లేని చోట నిర్మించే జగనన్న కాలనీలు మరో ఇందిరమ్మ కాలనీల్లా తయారు కానున్నాయని అభిప్రాయపడ్డారు.