TDP fires on govt over rapes in state: శ్రీసత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థినిని హత్యాచారం చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మృతదేహాంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకి దిగితేగానీ పోలీసులు స్పందించకపోవడం ఘోరమని మండిపడ్డారు. బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయి అఘాయిత్యానికి బలైతే, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తాము కోరడం యాగీ చేయడం కాదని ముఖ్యమంత్రికి చంద్రబాబు చురకలంటించారు.
ప్రజల మానప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుంటే, ప్రతిపక్షంగా నిలదీయడం తమ బాధ్యత అని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి స్పందించాలంటే ఇంకెంతమంది మహిళలు బలవ్వాలని నిలదీశారు.
వైకాపాపై లోకేశ్ ఆగ్రహం..వైకాపా సర్కారు రేపిస్టులకు మద్దతుగా నిలుస్తుండడంతో శ్రీ సత్య సాయి జిల్లాలో బీ ఫార్మసీ విద్యార్థినిపై సామూహిత్య అత్యాచారం జరిగిందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఓ మానవమృగం యువతిని తన ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డని కోల్పోయిన తల్లి న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట అభాగ్యురాలిలా వేడుకుంటున్నా.. ప్రభుత్వానికి కనికరం కలగడం లేదా అని నిలదీశారు.
అఘాయిత్యాలు జరగని రోజు లేదు.. జగన్ రెడ్డి చేతకాని పాలనలో రాష్ట్రంలో మహిళలపై ప్రతిరోజు మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మూడేళ్ల పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరగని రోజు లేదని.. వారి ఆర్తనాధాలు వినిపించని చోటు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లాలో ఓ ఉన్మాది బీఫార్మసీ విద్యార్ధిని అత్యంత కిరాతంగా అత్యాచారం చేసి హత్య చేశాడని మండిపడ్డారు. యువతిపై అత్యచారానికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం: