కరోనా టీకాల కార్యక్రమం కూడా ఉన్నందున ఎన్నికల నిర్వహణ కష్టమన్న ప్రభుత్వ వాదనను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. పిటిషన్లపై సోమవారం 18 నిమిషాలపాటు వాదనలు విన్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర పిటిషనర్ల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కరోనా వచ్చాక దేశంలో ఎక్కడా ఎన్నికలే జరగలేదా అని ప్రశ్నించిన ధర్మాసనం.. ఇది రాజకీయ ప్రక్రియ అని, దాన్ని పూర్తి కానివ్వండని సూచించింది. కనీసం నాలుగు వారాల గడువివ్వాలన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను తోసిపుచ్చింది. ఎవరి పని వారిని చేసుకోనివ్వండని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను బట్టి చూస్తే ఎన్నికల వాయిదాకు కరోనా టీకాల కార్యక్రమం కారణం కాదని, ఇంకేదో ఉన్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
ప్రస్తుత పరిస్థితులు రెండు వ్యవస్థల మధ్య అహంకార యుద్ధానికి దారితీసినట్లు కనిపిస్తోందని, అందులో తాము భాగస్వాములం కాదలచుకోలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పిలిచిన సమావేశానికి ఉద్యోగులు హాజరుకాకపోవడం అరాచకమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరిని అంగీకరించబోమని కుండబద్దలు కొట్టింది. ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు ఎలా చేస్తారని నిలదీసింది. ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. ఉద్యోగులు, వైద్యులు, అధికారులు పిటిషన్లు వేయడంపైనా ధర్మాసనం అసహనం ప్రకటించింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎందుకొస్తున్నారని నిలదీసింది. దీన్ని అనుమతిస్తే భవిష్యత్తులో ఇలాగే వస్తారని.. అందుకే అన్ని పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తేల్చిచెప్పింది. విచారణలో భాగంగా వాదప్రతివాదనలు జరిగిన తీరిదీ..
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పడాన్ని అనుమతించలేం. ఎన్నికల సంఘం ఉన్నదే ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించడానికి. అందువల్ల న్యాయస్థానాలు ఎన్నికల సంఘాలు, ప్రభుత్వాల పనులను తన చేతుల్లోకి తీసుకోలేవు. మీరు దాఖలు చేసిన కేసులో కమిషనర్ దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు ఇందులోకి ఎందుకొచ్చారు? ఉద్యోగ సంఘాలు కమిషనర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయడం దురదృష్టకరం. అసలేం జరుగుతోంది? ఎస్‌ఈసీ పిలిచిన సమావేశానికి అధికారులు ఎందుకు హాజరుకాలేదు? ఇది పూర్తిగా అరాచకం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం.
- సుప్రీం ధర్మాసనం
ముకుల్ రోహత్గీ (రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది):పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జనవరి 8న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం నిర్వహించారు. కరోనా టీకాల కార్యక్రమం నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు పెట్టాలని జనవరి 23న షెడ్యూల్ విడుదల చేశారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు వంటి ఫ్రంట్‌లైన్ కరోనా వారియర్స్‌కు టీకాలు వేసే కార్యక్రమం ఉన్నందున గోవాతో పాటు పలు రాష్ట్రాలు ఎన్నికలను వాయిదా వేశాయి. రాష్ట్రంలో పది లక్షల మందికి టీకాలు వేయాలి. టీకాల నిల్వ, సరఫరా, కార్యక్రమం కొనసాగింపునకు పోలీసులు, ఉపాధ్యాయులు అవసరం. అందువల్ల ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారానికి ఎన్నికలను వాయిదా వేయాలని కోరాం. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు జరపాల్సిందేనన్న ఎస్‌ఈసీ ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ జడ్జి తిరస్కరించారు. డివిజనల్ బెంచ్ మాత్రం ఎన్నికలు, టీకాల కార్యక్రమం ఒకేసారి నిర్వహించాలని ఆదేశించింది. రెండూ ఒకేసారి ఎలా సాధ్యం? ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు 4.5 లక్షల మంది సిబ్బంది, 95 వేల మంది పోలీసులూ అవసరం. లక్షలాది మందికి టీకా వేయాల్సి ఉన్నప్పుడు ఎస్‌ఈసీ ఎందుకు ఎన్నికలు వాయిదా వేయకూడదు? చాలా రోజుల నుంచి జరగని ఎన్నికల కోసం ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు?
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్: గత ఏడాది ఎన్నికలు జరగలేదు. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పడాన్ని అనుమతించలేం. ఎన్నికల సంఘం ఉన్నదే ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించడానికి. అందువల్ల న్యాయస్థానాలు ఎన్నికల సంఘాలు, ప్రభుత్వాల పనులను తన చేతుల్లోకి తీసుకోలేవు.
ముకుల్ రోహత్గీ: ఫ్రంట్‌లైన్ కరోనా వారియర్స్‌కు టీకాలు వేయాలనే విషయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గ్రహించాలి.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్: దేశంలో ఎక్కడా ఎన్నికలు నిలిచిపోలేదు. అన్ని చోట్లా జరుగుతున్నాయి.
ముకుల్ రోహత్గీ: పరిస్థితులను తప్పుగా అన్వయిస్తున్నారు. బిహార్‌లో అక్టోబరులో ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీకాల కార్యక్రమం లేదు.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్: ఇది రాజకీయ ప్రక్రియ. కారణాలు ఏవైనా కావచ్చు కానీ మీరు ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి అంగీకరించడం లేదు.
ముకుల్ రోహత్గీ: ఒకవైపు ప్రభుత్వం మొత్తం ఒక ప్రత్యేకమైన పనిపై ఉన్నప్పుడు ఇలా వ్యవహరించడం అన్యాయం.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్: రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం లేదు.
ముకుల్ రోహత్గీ: కనీసం నాలుగు వారాలైనా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలి. ఫిబ్రవరి 20కల్లా వీరందరికీ టీకాలు వేయడం పూర్తవుతుంది. మార్చి తొలి వారంలో ఎన్నికలు నిర్వహించొచ్చు. టీకాల ప్రక్రియ వదిలిపెట్టి ఎన్నికల కార్యకలాపాల్లో పాలుపంచుకోమని పోలీసులకు చెప్పగలమా? ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారిని అరికట్టడమే జాతీయ ప్రాధాన్యం. సింగిల్ జడ్జి తీర్పునూ పరిశీలించండి.
జస్టిస్ హృషికేశ్‌రాయ్: హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును మేం సమర్థించలేం. తీర్పును సమర్థించుకోవడానికి అందులో ఆయన ఎలాంటి కారణమూ చెప్పలేదు. అధికార వ్యవస్థలకు భిన్నమైన విధులుంటాయి. అందువల్ల న్యాయస్థానాలు వాటి అధికారాలను తన చేతుల్లోకి తీసుకొని మీ పనులు చేయడానికి వీల్లేదని చెప్పలేవు. కమిషనర్ దుర్బుద్ధితో పనిచేస్తున్నారని మీరు పదేపదే చెబుతున్నారు.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్: ఎవరి పనులను వారు చేసుకోనివ్వండి.
ముకుల్ రోహత్గీ: గోవాతో పాటు పలు రాష్ట్రాలు ఎన్నికలను వాయిదా వేశాయి. కరోనా ఆరంభంలో ఎన్నికలను వాయిదా వేసిన ఎస్‌ఈసీ ప్రస్తుతం ఫ్రంట్‌లైన్ కరోనా వారియర్స్‌కు టీకాలు వేసే సమయంలో ఎన్నికలకు వెళ్లడమేంటి?
జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్: మీరు ఏ అంశంపై న్యాయస్థానానికి వచ్చారో అదే పిటిషన్‌లో ఉండాలి. ఎన్నికల సంఘ కార్యక్రమాల విషయంలో అనుచితంగా ఎలా స్పందిస్తారు? మీరు దాఖలు చేసిన కేసులో కమిషనర్ దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు ఇందులోకి ఎందుకొచ్చారు? ఉద్యోగ సంఘాలు కమిషనర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయడం దురదృష్టకరం. అసలేం జరుగుతోంది?
ముకుల్ రోహత్గీ: నేను వాటికి మద్దతివ్వడం లేదు. ఆ జెంటిల్‌మన్‌కు నేను వ్యతిరేకం కాదు. మేం ఆ పదాన్ని ఉద్దేశపూర్వకంగా వాడలేదు. మేం ఆ విషయంలో కొంత పరిధి దాటినట్లు అనిపిస్తోంది.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్: ఈ ఎన్నికలు ఆయన కాలపరిమితి ముగిసిన తర్వాత జరపాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది కదా?
ముకుల్ రోహత్గీ: ఆయన కాలపరిమితి మార్చితో ముగుస్తుంది.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్: అందుకే.. ఇదంతా జరుగుతోంది. ఆయన ఉన్న సమయంలో ఎన్నికలు జరపడానికి మీరు ఇష్టపడట్లేదు.
ముకుల్ రోహత్గీ: ఈ కేసుకు అది ప్రధాన ప్రాతిపదిక కాదు. వ్యక్తులు ఒక్కరే ఎన్నికలు నిర్వహించలేరు.