మెదడుకు పదునుపెట్టి.... కాస్త సృజనాత్మకతను జోడిస్తే చాలు అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఆ కళను గుర్తించి అందుకు తగిన విధంగా సాధన చేసినప్పుడే ఎవరైనా పూర్తి స్థాయిలో రాణించగలరు. సరిగ్గా అదే పని చేశాడు ఆ యువకుడు. తాను నేర్చుకున్న చిత్రకళకు హంగులద్ది చిత్రకారుడిగా పేరు సంపాదించాడు. ప్రతిభ మన సొంతమైతే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్న చందంగా.... తనలోని కళను నిరంతర సాధన చేయడంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. నాలుగు ప్రపంచ స్థాయి రికార్డులు అందుకోవడంతో పాటు.... తనలోని కళను పది మందికీ పంచాలనే ఉద్దేశంతో 'చిత్రం' అనే సంస్థను ప్రారంభించాడు. 2వేలకు మందికి పైగా చిత్రకారులను తయారుచేసి....'చిత్రం' కీర్తిని దశదిశలా వ్యాప్తి చేస్తున్నాడు.
చిత్రలేఖనంలో మెళకువలు నేర్పిస్తున్న ఈ యువకుడి పేరు సుధీర్. చిన్నతనం నుంచే చిత్రలేఖనంపై మక్కువ పెంచుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాతి నుంచి పూర్తి స్థాయిలో చిత్రలేఖనంపై దృష్టి సారించాడు. చిత్రలేఖనంలో బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అందించే లోయర్, హయ్యర్ కోర్సులను నేర్చుకొని... అనంతరం గుంటూరులో టీటీసీ పూర్తి చేశాడు. అప్పటికీ సంతృప్తి చెందకుండా...కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి BFA హానర్స్ పూర్తి చేశాడు. తనలోని కళను పది మందికీ నేర్పాలనుకున్నాడు. అలా 2008లో విజయవాడలో 'చిత్రం' పేరుతో చిత్రలేఖనం సంస్థను ప్రారంభించాడు. మొదట్లో ఐదుగురితో ప్రారంభమైన సంస్థ... నేడు 2వేల పైచిలుకు విద్యార్థులను చిత్రలేఖనంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాడు సుధీర్......
సుధీర్ వద్ద చిత్రలేఖనం నేర్చుకునే వారిలో ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల బామ్మ వరకు ఉండటం విశేషం. ఇండియన్ టీచర్ ట్రైనింగ్, మలేషియన్ టీచర్ ట్రైనింగ్ కోర్సులు నేర్చుకున్న సుధీర్ కేవలం చిత్రలేఖనంలోనే కాదు....ఆర్కిటెక్చర్, విజువల్ ఆర్ట్స్, ఏరోనాటికల్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంటీరియర్, ఎక్స్ టీరియర్, ట్రాన్స్ పోర్ట్ డిజైనింగ్....లాంటి పదుల కోర్సులకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే అర్హత పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాడు.
గతంలో చిత్రం సంస్థలో చిత్రలేఖనంలో తర్ఫీదు పొంది.....విదేశాల్లో స్థిరపడిన వారు సైతం వేసవి సెలవుల్లో భాగంగా మళ్లీ సుధీర్ వద్దకు వచ్చి తమ కళకు పదును పెట్టుకుంటున్నారు. చిత్రలేఖనానికి అవధులు ఉండవని....ఎంతనేర్చుకున్నా ఎంతోకొంత మిగిలే ఉంటుందని చెబుతున్నారు.