ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

New Districts In AP: రాష్ట్రంలో కొత్త జిల్లాల కుంపటి.. కొనసాగుతున్న ఆందోళనలు

New Districts In AP: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలుగా తమ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొన్నిచోట్ల జిల్లా పేర్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భారీ ప్రదర్శనలు, ధర్నాలతో ప్రజలు తమ నిరసన తెలియజేస్తున్నారు. మార్పులు, చేర్పులు చేయకుంటే మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు.

protests  against news districts
రాష్ట్రంలో కొత్త జిల్లాల కుంపటి

By

Published : Jan 29, 2022, 8:18 PM IST

రాష్ట్రంలో కొత్త జిల్లాల కుంపటి

New Districts:కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. మదనపల్లె జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. విపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చిత్తూరు బస్టాండ్ వద్ద జనసేన ఆధ్వర్యంలో లక్ష పోస్టు కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ బంద్ నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నాయకులు ఆందోళన నిర్వహించారు. బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. అంబేడ్కర్‌ సర్కిల్ వద్ద నవీన్ అనే యువకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. విద్యార్థులు వినూత్నంగా అర్థనగ్నంగా మోకాళ్లపై నడుస్తూ వినూత్న నిరసన తెలిపారు.

కడప జిల్లాలో మానవహారాలు.. ఆందోళనలు

కడప జిల్లా రైల్వేకోడూరులోనూ ఆందోళనలు మిన్నంటాయి. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అంటూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు నినాదాలు చేశారు. ప్రజల అభీష్టం మేరకు రాజంపేటనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. రాజంపేటలో విద్యార్థులు, నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ కూడలిలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. తాళ్లపాకలో అన్నమయ్య విగ్రహం వద్ద మహిళలు నిరసన తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా పేరును అలాగే కొనసాగించాలని.. కడప అనే పదాన్ని తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అఖిలపక్ష పార్టీ నాయకులు హెచ్చరించారు.

శ్రీకాకుళం జిల్లాలో ర్యాలీలు..

శ్రీకాకుళం జిల్లా సీతంపేటను మన్యం జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఐటీడీఏ ప్రధాన గేటు వద్ద నిరసన తెలియజేశారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేయాలని అమలాపురంలో అంబేడ్కర్ జిల్లా సాధన సమితి నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రిలేదీక్ష చేపట్టారు. అమలాపురం ఎంపీ చింతా అనురాధ, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దీక్షకు మద్దతు తెలిపారు. పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలంటూ పెదపూడిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన ర్యాలీ చేపట్టారు.

విజయవాడలో ఆందోళనలు..

విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న నూతన జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని గుడివాడలో జనసేన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన పార్టీ శ్రేణులు.. నూతన జిల్లాకు రంగా పేరు పెట్టేలా మంత్రి నాని చొరవ తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎన్టీఆర్​ జన్మించిన నిమ్మకూరు తూర్పు కృష్ణాలో ఉన్నందున కృష్ణా జిల్లాకు ఎన్​టీఆర్ కృష్ణా జిల్లాగానూ.. నూతన జిల్లాకు వంగవీటి రంగా జిల్లాగా నామకరణం చేయాలని విజయవాడ సిటీ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

విజయవాడకు సమీపంలో ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను విజయవాడ పార్లమెంట్ జిల్లాలోనే కొనసాగించాలన్నారు. నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చేశారు. జిల్లా కేంద్రం తిరుపతి 160 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల మండలం అభివృద్ధిలో మరింత వెనకబడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Kodali Nani on Casino: తెదేపా నేతలకు జీవితకాలం సమయమిచ్చా.. ఇక వాళ్ల ఇష్టం: కొడాలి నాని

ABOUT THE AUTHOR

...view details