SSC Exams: పదో తరగతి పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 2 వేల 537 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో బాలికలు 3 లక్షల 2 వేల 474 మంది ఉన్నారు. మొత్తం 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు తావు లేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సహేతుక కారణాలతో అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతిస్తున్నారు. ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని ప్రైవేటు పాఠశాలలు.. విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నందున.. వెబ్‌సైట్ ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లపై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకపోయినా.. అనుమతించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్.. అనంతపురం జిల్లాలో పరీక్ష కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పదోతరగతి పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో సమస్యలు తలెత్తితే.. కంట్రోల్ రూంకు తెలియజేయాలని అధికారులు కోరారు. కర్నూలు జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. వైఎస్ఆర్ జిల్లాలో.. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 10 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించారు.
వసతులు లేక: పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు.. కొన్ని చోట్ల పరీక్ష కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. రెయిన్‌బో పాఠశాల వద్ద పరీక్ష కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించకపోవడంతో... విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఫ్యాన్లు కూడా లేని గదుల్లో పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ నిలదీశారు. ఇదేంటని ప్రశ్నిస్తే... తామేం చేయలేమంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కనీసం ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని.. విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
గుడ్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి రాస్తున్న విద్యార్థులకు పొగ సెగ తగిలింది. పాఠశాల సమీపంలో చెత్తాచెదారాన్ని.. గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడంతో.. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. పదో తరగతి పరీక్షలు రాసేందుకు గదుల్లో కూర్చున్న విద్యార్థులనూ పొగ చుట్టుముట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులూ పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.