దేశంలోని వివిధ డ్యామ్‌ల భద్రత కోసం ప్రపంచ బ్యాంకు నిధులతో కేంద్ర జలశక్తిశాఖ డ్రిప్ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులో కేంద్ర, రాష్ట్రాలు 70:30 నిష్పత్తిలో నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ పథకానికి రాష్ట్రం నుంచి 31 ప్రాజెక్టులను పరిశీలించారు. అయితే ఏ ప్రాజెక్టూ పథకం మార్గదర్శకాల ప్రకారం లేకపోవడం వల్ల డ్రిప్ నిధులు తెచ్చుకునే అవకాశం కలగలేదు. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి సంబంధించిన కొన్ని పనులను ఈ పథకానికి ప్రతిపాదించారు. 2009 వరదల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు డ్యాం డిజైన్‌ను మించి ప్రవాహాలు వచ్చాయి. అంటే ఆ స్థాయి ప్రవాహాన్ని తట్టుకునేలా పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే శ్రీశైలం స్పిల్‌వే దిగువన ప్లంజ్ పూల్‌లా పెద్ద గొయ్యి ఏర్పడింది. అది స్పిల్‌వే వరకు విస్తరిస్తోంది.
2017, 2020లో శ్రీశైలం భద్రతను సమీక్షించిన డ్యాం భద్రతా కమిటీ అనేక సిఫార్సులు చేసింది. ప్రస్తుతం డ్రిప్-2 పథకంలో 700 కోట్లతో శ్రీశైలం ప్లంజ్ పూల్‌ను కాంక్రీటుతో పూడ్చాలని, మరో 90 కోట్లతో పలు చిన్న చిన్న పనులు చేయాలని ప్రతిపాదించింది. కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్ పాండ్యా నేతృత్వంలోని డ్యాం భద్రతా కమిటీ ఈ ప్రాజెక్టులను పరిశీలించి డ్రిప్ కింద ఈ పనులు చేపట్టవచ్చని నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా డ్యాం భద్రతా కమిటీ గత వారం శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించి, అక్కడే సమావేశమైంది. ప్లంజ్ పూల్ ఏర్పడటం అత్యంత సహజమని ఈ సందర్భంగా పాండ్యా అన్నట్లు తెలిసింది.