ఆర్టీసీకి ప్రస్తుతం 11 వేల సొంత బస్సులున్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాలకు తిరిగే పల్లెవెలుగు బస్సుల్లో 4 వేల 100బస్సులు 9 లక్షల కిలోమీటర్లు పైగా తిరిగాయి. తరచూ మరమ్మతులకు గురవుతూ, సీట్లు చిరిగిపోయి, డొక్కు బస్సులుగా తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణానికి ప్రయాణికుల ఆసక్తి చూపడం లేదు. పలువురు ప్రైవేటు ఆటోలను ఆశ్రయిస్తున్న కారణంగా ఆర్టీసీ ఆదాయం పడిపోతోంది. ఫలితంగా గ్రామీణ ప్రాంత సర్వీసుల్లో నష్టాలు మరింత పెరుగుతున్నాయి. పరిస్ధితిని మార్చాలని నిర్ణయించిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుల్లో(modifying rtc pallevelugu busses) సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది.
వేగంగా బస్సుల ఆధునికీకరణ..
సాధారణంగా 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. మరో 3 లక్షల కిలోమీటర్లు తిరిగేందుకు అవకాశం ఉన్న ఈ బస్సులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం సహా కొత్త సొబగులు అద్ది.. 4 వేల పల్లెవెలుగు బస్సులను కొత్త బస్సుల్లా తయారు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు(apsrtc md dwaraka tirumala on pallevelugu busses remodeling) ఆదేశించారు. ఆర్టీసీలోని 4 ప్రధాన వర్క్ షాపుల్లో పల్లెవెలుగు బస్సుల ఆధునికీకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. విజయవాడ, నెల్లూరు, విజయనగరం, కడప వర్క్ షాపుల్లో వాటి పరిధిలోని డిపోల్లో ఉన్న పల్లెవెలుగు బస్సులన్నింటికీ రూపు మార్చుతున్నారు. సరికొత్తగా తయారు చేస్తున్నారు.
చేయాల్సిన మరమ్మతులపై చార్టు..
పల్లె వెలుగు బస్సులకు ఫిట్ నెస్ ఉండేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది. బస్సుల గుర్తింపు కోసం తొలుత డిపోల్లో ఉన్నతాధికారులతో కమిటీ నియమిస్తారు. 9 లక్షల కిలోమీటర్లు పైన తిరిగిన బస్సులను గుర్తించి వాటిలో చేయాల్సిన మరమ్మతులను గుర్తించి చార్టు తయారు చేస్తారు. బస్సుల్లో సీట్లు , లైటింగ్, కిటికీ అద్దాలు, తదితర వాటి పరిస్ధితిని నమోదు చేసి మార్చాల్సిన వాటిని సూచిస్తారు.