తెలంగాణ సచివాలయ సాధారణ పరిపాలనా శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఇక నుంచి రాత్రి విధులు కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. కీలకమైన నియామకాలు, ప్రోటోకాల్, కేబినెట్, ఇతర శాఖలతో సమన్వయం, విపత్తుల సహాయ, పునరావాస చర్యల కోసం పర్యవేక్షణ, సమన్వయం చేస్తున్న జీఏడీ అధికారులు, ఉద్యోగులు పలు సందర్భాల్లో 24 గంటల పాటు విధులు నిర్వహించాల్సి వస్తోందన్న ప్రభుత్వం... కొంత మంది ఉద్యోగులు, సిబ్బందితో కూడిన బృందాన్ని రాత్రి సమయంలోనూ విధుల్లో ఉంచాలని నిర్ణయించింది.
రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు సదరు బృందాలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సెలవు రోజుల్లోనూ రెండు షిఫ్టులుగా జీఏడీ బృందం పనిచేయాల్సి ఉంటుంది. సిబ్బంది సహకారంతో ఇద్దరు విభాగాధికారులు ఈ విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.