ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RTC: బదిలీలపై ఆర్టీసీ ఉద్యోగుల ఆగ్రహం.. ఐచ్ఛికాలు ఇచ్చేందుకు నిరాకరణ

RTC: ఆర్టీసీలో ఐదేళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్నవారి బదిలీకి యాజమాన్యం చేపట్టిన ప్రక్రియపై.. వేల మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపుమేరకు బదిలీకి ఐచ్ఛికాలు (ఆప్షన్లు) ఇచ్చేందుకు దాదాపు ఉద్యోగులెవరూ ముందుకు రావడం లేదు.

rtc employees fires on not giving them options of transfers
బదిలీలపై ఆర్టీసీ ఉద్యోగుల ఆగ్రహం

By

Published : Jun 12, 2022, 9:53 AM IST

RTC: ఆర్టీసీలో ఐదేళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్నవారి బదిలీకి యాజమాన్యం చేపట్టిన ప్రక్రియపై.. ఆ సంస్థలోని 51 వేల మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపుమేరకు బదిలీకి ఐచ్ఛికాలు (ఆప్షన్లు) ఇచ్చేందుకు దాదాపు ఉద్యోగులెవరూ ముందుకు రావడంలేదు.

కొన్ని జిల్లాల్లో త్వరగా ఐచ్ఛికాలు ఇవ్వాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నప్పటికీ, ఉద్యోగులు మాత్రం ఇవ్వబోమని చెబుతున్నారు. ఐచ్ఛికాలు ఇవ్వనివారిని, తమకు నచ్చినచోటికి బదిలీ చేస్తామని బెదిరిస్తున్నప్పటికీ..సిబ్బంది పట్టించుకోవడంలేదు. ఈ విషయంలో యాజమాన్యంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పీఆర్సీ జీవోల ద్వారా అన్యాయం జరిగిందని గళమెత్తుతున్నవేళ.. ఉద్దేశపూర్వకంగా పెద్దఎత్తున బదిలీల ప్రక్రియ చేపట్టారనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.

గతంలో ఇలా..:ఆర్టీసీలో గతంలో సూపర్‌వైజర్లు, మేనేజర్లు, ఆపై కేడర్‌లో అధికారులకు బదిలీలు ఉండేవి. కింది స్థాయిలోని డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు మొదలుకొని మిగిలిన వారికి బదిలీలు లేవు. ఎవరైనా బదిలీకి రిక్వెస్ట్‌ దరఖాస్తు చేసుకుంటే.. ఆ ఉద్యోగి కోరినచోట ఖాళీ అయినప్పుడు అవకాశం ఇచ్చేవారు. ఒకవేళ తప్పనిసరిగా రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. సంబంధిత డిపోలో జూనియర్‌ ఉద్యోగిని బదిలీచేసి, ఆ స్థానంలో అవకాశం కల్పించేవారు. ఇప్పుడు ఒకేసారి అయిదేళ్లు దాటిన వారంతా రిక్వెస్ట్‌ బదిలీలకు ఐచ్ఛికాలు ఇవ్వాలనడం గందరగోళానికి దారితీసింది.

ఒకేసారి మారితే అన్నీ సమస్యలే..:వివిధ విభాగాల ఉద్యోగులను ఒకేసారి బదిలీచేస్తే పలు ఇబ్బందులు ఉంటాయని పేర్కొంటున్నారు. సాధారణంగా బస్సులు నడపటంపై డ్యూటీ ఛార్ట్‌ ఉంటుంది. దీనిప్రకారం ఓ బస్సుకు స్థిరంగా డ్రైవర్‌, కండక్టర్‌ ఉంటారు. వీరే నిత్యం ఆ రూట్లలో తిరుగుతుంటారు. దీనివల్ల వారికి ఆయా రూట్లలో ఏ సమయంలో ప్రయాణికుల రద్దీ ఉంటుంది.. తదితర అంశాలపై అవగాహన ఉంటుంది. ఇప్పుడు మార్చేస్తే ఇబ్బందేనని చెబుతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పల్లెవెలుగు బస్సులు నడిపే డ్రైవర్లను విజయవాడ, విశాఖపట్నం నగరాలకు బదిలీచేస్తే, అక్కడి సిటీ బస్సులు నడపటం కష్టమవుతుందని పేర్కొంటున్నారు.

వారం రోజులు సెలవు ఇస్తే?:ఆర్టీసీ నిబంధనల ప్రకారం యాజమాన్యమే ఉద్యోగులను బదిలీచేస్తే, రెండు మూల వేతనాల మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చి, కొత్తచోట చేరేందుకు వారం గడువు ఇవ్వాలి. ఈ నెల 17 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ఎండీ సర్క్యులర్‌ జారీచేశారు. దీంతో అనేక మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, క్లరికల్‌ సిబ్బందికి ఒకేసారి బదిలీపేరిట వారం సెలవిస్తే, అనేక సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

* ఎక్కువ మంది సిబ్బంది.. తాము పనిచేస్తున్న డిపో పరిధిలోనే స్థిర నివాసాలు ఏర్పాటుచేసుకొని ఏళ్ల తరబడి అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు మరోచోటికి బదిలీచేస్తే ఇబ్బందేనని చెబుతున్నారు.

* ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తయినవారికి బదిలీలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారని.. తాము ప్రభుత్వ ఉద్యోగులుగా మారి రెండున్నరేళ్లు కూడా పూర్తికాలేదనే వాదనను కొందరు వినిపిస్తున్నారు.

పునరాలోచన చేయాలి:బదిలీలపై పునరాలోచన చేయాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కోరింది. దీనివల్ల సంస్థకు, ఉద్యోగులకు ప్రయోజనం ఉండదని తెలిపింది. రిక్వెస్టులు చేసుకున్నవారికి, ఖాళీలు ఉన్నమేరకు బదిలీలు చేయాలని విజ్ఞప్తి చేసింది. అందరినీ ఒకేసారి కదుపుతామనటం సరికాదని పేర్కొంది.

* రిక్వెస్ట్‌ బదిలీలనే పరిగణనలోకి తీసుకుంటామని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకేచోట ఎక్కువకాలం పనిచేస్తున్నవారిని బదిలీచేసి, ఆ స్థానంలో రిక్వెస్ట్‌ పెట్టుకున్నవారికి అవకాశం ఇస్తామని చెప్పారు. కొన్ని డిపోల్లోనే బదిలీలకు డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details