రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం - land
స్పందన కార్యక్రమంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఈ భూమిని పొందారని జాయింట్ కలెక్టర్ మాధవీలత తెలిపారు.
విజయవాడ నడిబొడ్డున వందల కోట్ల రూపాయలు విలువజేసే ప్రభుత్వ భూమిని శుక్రవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత వారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కలెక్టర్ ఇంతియాజ్ ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సుమారు రూ.200 కోట్ల విలువైన ఈ భూవివాదం చాలా ఏళ్ల నుంచి కోర్టు పరిధిలో ఉంది. మొత్తం ఐదు ఎకరాల 10 సెంట్ల భూమిలో గతంలో రైల్వే ట్రైనింగ్ సెంటర్ నిర్వహించేవారు. కోర్టు తీర్పు కారణంగా సి.నాగేంద్రకు రైల్వే అధికారులు 2018లో ఈ భూమిని అప్పగించారు. అతడు దాని చుట్టూ ప్రహరీ కట్టి పెన్సింగ్ వేశారు. తాజాగా దీనిపై వచ్చిన ఫిర్యాదుతో స్పందించిన అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో అక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించారు. ఇది ప్రభుత్వ భూమి అని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ మాధవీలత వివాద ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు. 1976లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఈ భూమిని పొందారని, అనంతరం రైల్వే శాఖకు అప్పగించారని తెలిపారు.