Sahasrabdhi Vedukalu Day1: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే సమతామూర్తి ఉత్సవాలు.. తొలి రోజు పెరుమాళ్ల శోభాయాత్రతో మొదలయ్యాయి. త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో వేలాది మంది రుత్వికులు, పీఠాధిపతులు, ఆశ్రమ విద్యార్థుల శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రోచ్ఛరణతో పల్లకిలో పెరుమాళ్లు యాగశాలకు చేరుకున్నారు. యాగశాలలో నిర్వహించే లక్ష్మీనారాయణుడి మహాయజ్ఞంలో భాగంగా విశ్వక్సేనుడి పూజ, వాస్తు పూజ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు వేదపారాయణ నడుమ అంకురార్పణ జరుగనుంది. చినజీయర్ స్వామి చేతుల మీదుగా జరగనున్న ఈ అంకురార్పణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.
5 వేల మంది రుత్వికులతో..
శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం పేరుతో నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్న ఈ వేడుకల్లో.. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. 216 అడుగుల ఎత్తున నిర్మించిన రామానుజాచార్య విగ్రహాన్ని వైభవంగా ఆవిష్కరించనున్నారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి అరగంట పాటు విష్టు సహస్రనామ పారాయణం ఉంటుంది. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ 12 రోజుల మహాక్రతువులో ప్రధానమైన యాగశాలలో 1035 కుండాలలో మహాయజ్ఞం జరుగతుంది. ఈ మహాయాగాన్ని 5 వేల మంది రుత్వికులు నిర్వహిస్తున్నారు. వీరంతా... తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటక సహా అమెరికా నుంచి వచ్చారు. యాగానికి అవసరమైన పదివేల పాత్రలను రాజస్థాన్ నుంచి తెప్పించారు. యాగశాలను.. వాలంటీర్లు అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దారు.
12 వేల మంది వాలంటీర్లు..
ఈ వేడుకల్లో సేవలందించేందుకు వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 12 వేల మంది వాలంటీర్లు వివిధ దశల్లో భక్తులకు సేవలందిస్తున్నారు. అమెరికాలోని 15 రాష్ట్రాలతోపాటు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 20 జిల్లాలు సహా మరో 18 రాష్ట్రాల నుంచి సేవకులు వచ్చారు. యాగశాల, సమతామూర్తి విగ్రహం, ఆహారశాలలు, మరుగుదొడ్లు వంటి వేర్వేరు చోట్ల వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు.