హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం భారీ వర్షం హైదరాబాద్‌ను ముంచెత్తింది. నగరంలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. వివిధ చోట్ల రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హయత్‌నగర్ నుంచి ఎల్బీ నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటిలో చాలాసేపు వాహనాలు నిలిచిపోయాయి. సుష్మా, పనామా, చింతల్‌కుంట కూడళ్లు సహా జాతీయ రహదారిపై భారీగా వర్షపునీరు నిలిచింది. చింతల్‌కుంట నుంచి ఎల్బీనగర్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, అనాజ్‌పూర్‌లో కూడా వర్షం పడింది. దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, సైదాబాద్, చంపాపేట్‌లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాతబస్తీ, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది.హబ్సీగూడ, నాగోల్, రామంతపూర్, కాచిగూడ, ఎల్బీనగర్, మన్సూరాబాద్, మీర్‌పేట్, తుర్కయంజాల్, శంషాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, రాంనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
దారి కనిపించక కింద పడుతున్న వాహనదారులు..
హైదరాబాద్‌లో భారీ వర్షంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చైతన్యపురిలోని వరదనీటిలో రహదారి కనిపించక... బైకుపై వెళ్తున్న వ్యక్తి కిందపడిపోయాడు. భారీగా కురిసిన వర్షానికి రోడ్లపై వరద ప్రవహిస్తోంది. నాచారం, హబ్సీగూడ, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాగూడ ప్రాంతాల్లో భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
జలదిగ్బంధం
భారీ వర్షం వల్ల కొత్తపేట జలదిగ్బంధమైంది. రోడ్లపై భారీగా నీరు చేరింది. వాహనదారులు నెమ్మదిగా ప్రయాణాలు సాగిస్తున్నారు.ముషీరాబాద్‌లోని కాలనీల్లో వరద ప్రవహించింది. వరదనీటిలో స్థానికుల వస్తువులు కొట్టుకుపోయాయి.హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో వర్షంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విజయవాడ జాతీయ రహదారిపై వర్షపు నీరు పారుతోంది. ద్విచక్రవాహనదారులు వర్షంలో ఎక్కడికక్కడే వాహనాలు నిలిపేశారు.
రాగల మూడు రోజులు వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు క్రింది స్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నట్లు తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీన పడినట్లు పేర్కొంది. ఈ నెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ, వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిశా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశంలోని కొన్ని భాగాల నుంచి విరమించాయని.. రాగల 2 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లలో మరికొన్ని భాగాల నుంచి విరమించే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి:Pending Bills of Neeru-Chettu: నీరు-చెట్టు పథకం బిల్లులు చెల్లించే వరకు కృషి చేస్తాం: చంద్రబాబు