అనంతపురం జిల్లా హిందూపురంలో పట్టు రైతులు ఆందోళన (Silk Farmers Protest) బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టు రైతులకు ప్రోత్సాహకంగా ఇచ్చే ఇన్సెంటివ్లు
(Incentives) గత రెండు సంవత్సరాలుగా ఇవ్వకపోవడంతో ఇప్పటిదాకా రూ.10 కోట్ల మేర బకాయిలు పడినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా..ఫలితం లేకకుండా పోయిందని వారు వాపోయారు.
హిందూపురంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్కు జిల్లా నుంచే కాకుండా కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి పట్టు రైతులు సాగు చేసిన పట్టుగూళ్లను విక్రయించేందుకు తీసుకువస్తారు. అయితే పట్టు గూళ్లను విక్రయించే సమయంలో రైతులకు ప్రోత్సాహకంగా నగదును అందించేవారు. అయితే రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్లు
(Incentives) చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో కష్టపడి పట్టును సాగు చేసి మార్కెట్కు తీసుకువస్తే..సరైన గిట్టుబాటు ధరలేక పోగా ఇన్సెంటివ్లు అందటం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని రైతులకు బకాయిపడిన ఇన్సెంటివ్లు వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
క్రాంటాక్ట్ బిల్లులు చెల్లించండి..
చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా కాంట్రాక్టర్లు (Contractors) తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ (State Building Contractors Association) సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడితో కృష్ణా జిల్లా కోడూరు మండలంలో ఇటీవల మృతి చెందిన కాంట్రాక్టర్ రేపల్లె శేషగిరిరావుకు వారు నివాళులర్పించారు. మూడేళ్లుగా రూ.18 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో శేషగిరిరావు మృతి చెందారని వారు ఆరోపించారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేసారు.