కరోనాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందుతుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు సాధారణ లక్షణాలుంటే రోజుకి రూ.3,500, ఆక్సిజన్ పెట్టి, ఐసీయూలో చేరిస్తే రోజుకి రూ.10వేల వరకు తీసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలో 30 పడకల ద్వారా చికిత్స అందించేందుకు అనుమతిస్తే... అదనంగా మరో పది పడకల వరకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించాలని షరతు పెట్టింది. కానీ... ధరలు, ఉచిత చికిత్సలపై సరైన పర్యవేక్షణ లేదు. సీటీ స్కాన్ పేరిట కొన్ని ఆసుపత్రులు బాధిత కుటుంబాలను హైరానాకు గురి చేస్తున్నాయి. రకరకాల పరీక్షల పేరిట పీల్చి పిప్పి చేస్తున్నాయి. బీమా సౌకర్యం ఉన్న వారితోనూ డబ్బులు డిపాజిట్ చేయిస్తున్నాయి. పైగా బీమా సంస్థల నుంచి రీఎంబర్స్‌మెంట్ పొందేందుకు అవసరమైన రసీదులను సక్రమంగా ఇవ్వడం లేదు. దాంతో బాధితులు నష్టపోతున్నారు.
‘ఆయాసం’తో వెళితే అంతే సంగతులు
శ్రీకాకుళం నగరంలోని ఓ పండ్ల వ్యాపారి ఆయాసం, జ్వరంతో ప్రైవేట్ కొవిడ్ ఆసుపత్రికి వెళ్లారు. రోజుకి రూ.50 వేలు చెల్లిస్తే... వైద్యం చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేయగా కుటుంబ సభ్యులు బతిమిలాడి రూ.40 వేలకు చేర్పించారు. మూడు రోజుల తర్వాత ఆయన మృతి చెందగా మొత్తంగా రూ.రెండు లక్షలు తీసుకున్నారు. గుంటూరులోని ఓ విశ్రాంతి ఉద్యోగి ఇదే లక్షణంతో వెళ్లగా రూ.5లక్షల బిల్లు రావడంతో ఆయన సన్నిహితులంతా కలిసి చెల్లించారు. ఆయాసంగా ఉంటోందని వచ్చిన వృద్ధుడికి నాలుగు రోజుల చికిత్సకు ఒంగోలులో రూ.1.50 లక్షల బిల్లు వేశారు. మరో బాధితుడికి మూడ్రోజులకు రూ.లక్ష వసూలు చేసిన ప్రైవేటు దవాఖానా... ఆయనకు పరిస్థితి విషమించటంతో తమ దగ్గర ఆధునిక సౌకర్యాలు లేవని, ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోవాలని సూచించడం గమనార్హం. విజయవాడలో ఓ చిరుద్యోగినికి ప్రైవేట్ ఆసుపత్రిలో తొలుత రూ.2లక్షలు చెల్లించాలన్నారు. క్రమేణా బిల్లును రూ.5లక్షలు చేశారు. దీంతో ఆమె తన నగలను విక్రయించారు.
అంతా అడ్డగోలు వ్యాపారమే
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని రెండోవార్డుకు చెందిన దంపతులు కొవిడ్ అనుమానంతో కాకినాడలోని కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లగా స్వల్పంగా లక్షణాలు ఉన్నాయంటూ చేర్పించుకున్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ పెట్టలేదు. మందులు, పడకకు ఏడు రోజులకు కలిపి రూ.4లక్షలు తీసుకున్నారు. రోడ్డు పక్కన క్షౌరశాల నిర్వహించుకుని బతికే 3వ వార్డుకి చెందిన యువకుడు శ్వాస సమస్యతో కార్పొరేట్ వైద్యశాలకు వెళితే 5రోజుల వైద్యానికి రూ.3.30 లక్షలు వసూలు చేశారు. 26వ వార్డుకి చెందిన పెయింటర్‌కు కాకినాడలోని అదే కార్పొరేట్ వైద్యశాలలో 5రోజులకు రూ.3.30 లక్షలు బిల్లు వేశారు. వీరంతా స్థోమతకు మించి అప్పులు చేయాల్సి వచ్చింది.
*విశాఖలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కి చెందిన వ్యక్తి(72) కొవిడ్‌తో ఇటీవల ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా రూ.1 లక్ష అడ్వాన్సుగా తీసుకున్నారు. ‘ఆయన్ని ఐసీయూలో చేర్చలేదు. ఆక్సిజనూ పెట్టలేదు. కానీ 6రోజులకు రూ.3లక్షల బిల్లు వేశారు.
గుండెలదిరే బిల్లులపై ఫిర్యాదులు
*కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ కుటుంబం కరోనా బారినపడి ప్రైవేట్ ఆసుపత్రిలో రూ.20 లక్షల వరకు ఖర్చుపెట్టింది. ఇక్కడ ఓ ఎంబీబీఎస్ వైద్యుడు... తన అర్హతకు మించి చికిత్స చేస్తుండడంపై ఫిర్యాదు అందగా ఏపీ వైద్య మండలి సంజాయిషీ నోటీసు జారీచేసింది.
*విజయవాడలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రి కొవిడ్ చికిత్సకు ఫీజుల రూపంలో భారీగా వసూళ్లకు దిగింది. ఫిర్యాదు రావడంతో విచారణ చేసిన అధికారులు దాని కొవిడ్ చికిత్స అనుమతిని రద్దుచేశారు.
*పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, బీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రులు బాధితుల నుంచి లక్షలాది రూపాయలను అక్రమ పద్ధతుల్లో వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. రెమిడెసివిర్ ఇంజిక్షన్లను వారితో కొనుగోలు చేయించి, వాడలేదనీ తేలింది.
*గుంటూరు జిల్లాలో అనుమతి లేకుండా కొవిడ్ చికిత్స చేస్తున్నారన్న ఆరోపణలపై రెండు ఆసుపత్రులకు అధికారులు నోటీసులిచ్చారు.
తండ్రి దక్కలేదు... పొలమూ అమ్మేస్తున్నారు