రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. దీంతో అనధికార విద్యుత్ కోతలు మళ్లీ వచ్చాయి. బుధవారం రాత్రి గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ఉష్ణోగ్రతలూ పెరగడంతో ఉక్కపోతతో తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. బుధవారం 198.21 మిలియన్ యూనిట్లు డిమాండ్ ఉంటే.. దీనికి అనుగుణంగా సరఫరా చేయలేక అత్యవసర లోడ్ సర్దుబాటు పేరిట 5.68 మిలియన్ యూనిట్ల మేర కోత విధించాల్సి వచ్చింది. దీని వల్ల మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో బుధవారం రాత్రి అంధకారం నెలకొంది. మున్సిపాలిటీల్లో అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల తర్వాత సరఫరా పునరుద్ధరించినా.. గ్రామాల్లో గురువారం తెల్లవారుజాము వరకూ సరఫరా చేయలేదు. అంచనాల మేరకు పవన విద్యుత్ రాకపోవడం, థర్మల్ యూనిట్లలో సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తి తగ్గడంతో అత్యవసర లోడ్ సర్దుబాటుకు కోతలు విధించాల్సి వచ్చిందని అధికారుల చెప్పారు.
గురువారం రాత్రి కూడా పలు పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 190 నుంచి 200 మిలియన్ యూనిట్ల మధ్య ఉండే అవకాశం ఉందనేది అధికారుల అంచనా. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరుల ద్వారా వచ్చే విద్యుత్ సరిపోతుందని భావించారు. ఈ మేరకు పరిశ్రమలకు విధించిన విద్యుత్ విరామాన్ని దశల వారీగా తొలగించారు. బుధవారం డిమాండ్ 198.21 మిలియన్ యూనిట్లు ఉన్నా.. దీనికి అనుగుణంగా సరఫరా చేయడం డిస్కంలకు సాధ్యపడలేదు. థర్మల్ విద్యుత్ 84.36 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్ 6.49, పవన విద్యుత్ 22.93, సౌర విద్యుత్ 14.08, ఇతర వనరుల నుంచి.. 5.73, కేంద్ర ఉత్పత్తి సంస్థ నుంచి 48.62 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు అందాయి. ఎక్స్‌చేంజీల నుంచి 6.73 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను డిస్కంలు కొన్నాయి. జాతీయ గ్రిడ్ నుంచి అన్ షెడ్యూల్డ్ ఇంటర్ ఛేంజ్ కింద 3.59 మిలియన్ యూనిట్లు అదనంగా తీసుకున్నా ఇంకా 5.68 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది.