ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ( ఈడబ్ల్యూఎస్ ) కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తూ గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది . రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించేదిగా రాష్ట్ర ప్రభుత్వ చట్టం ఉందని పేర్కొంటూ మంగళగిరి మండలం కిష్టాయపాలెం గ్రామానికి చెందిన పెద్ది రాధాకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు . ఈడబ్ల్యూఎస్ ప్రజలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం ఈ ఏడాది జనవరి 12న చేసిన రాజ్యాంగ 10వ సవరణ చట్టం - 2019 ద్వారా రాష్ట్రప్రభుత్వం తెచ్చిన చట్టం న్యాయవిరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
చట్టాన్ని రద్దు చేయండి
ఎస్సీ , ఎస్టీ , సామాజిక , విద్యా పరంగా వెనుకబడిన బీసీలు మినహా . . ఈడబ్య్లూఎస్ వర్గానికి చెందిన వారికి ఉన్నత విద్యలో ప్రవేశాలు , ఉద్యోగాల్లో ఫలాలు దక్కకుండా పోతున్నాయన్న కారణంతో వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ చట్టం చేసిందన్నారు . వీటిని కుల ప్రాతిపదకన విభజించాలని మాత్రం పేర్కోనలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కులానికి వర్తింప చేస్తూ చట్టం చేసిందని చెప్పారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని కాపులకు విద్యా సంస్థల్లో సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి , ప్రవీణ్ కుమార్ , జస్టిస్ ఎం . సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే అవకాశం ఉంది.
ఇదీ చదవండి
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాలి: సీఎం