‘వైకాపా ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యుల పుట్టినరోజు వేడుకలకు లేని కొవిడ్ నిబంధనలు... వినాయక చవితి పండగకే వర్తిస్తాయా? ప్రజల తరఫున పోరాడే ప్రతిపక్షాల విషయంలో గుర్తొస్తాయా?’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. ‘కొవిడ్ నిబంధనల కారణంగా చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోవడం నమ్మశక్యంగా లేదు. పక్క రాష్ట్రాలు షరతులతో అనుమతులు ఇస్తున్నప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వద్దనడం, విగ్రహాలు అమ్మేవారిని అరెస్టు చేయడం, విగ్రహాలు తీసుకెళ్లడం చేస్తున్నారు’ అని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన విమర్శించారు. ‘గతంలో విగ్రహాలను అపవిత్రం చేసినా.. శ్రీరాముడి విగ్రహానికి తల తీసేసినా ఇప్పటివరకు దోషుల్ని పట్టుకోలేదు. ఇప్పుడు కొత్తగా వినాయకచవితి ఉత్సవాలు వద్దంటున్నారు. ఇప్పటికైనా వైకాపా పెద్దలు కూర్చుని ఆలోచించుకోవాలి. పక్క రాష్ట్రాల్లాగే ఇక్కడా అనుమతులివ్వాలి. ఇది విశ్వాసాలకు సంబంధించిన అంశం’ అని స్పష్టం చేశారు. చాలా అభివృద్ధి చేశామని మంత్రివర్గ పెద్దలు చెబుతున్నా.. ఏదైనా కార్యక్రమానికి వైకాపా ప్రజాప్రతినిధుల్ని పిలిస్తే రోడ్లు బాగోలేక రాలేకపోతున్నట్లు చెబుతున్నారని పవన్‌కల్యాణ్ విమర్శించారు. ‘అక్టోబరు తర్వాత రోడ్ల మరమ్మతులు మొదలుపెడతాం అంటున్నారు. పోయినేడాది అక్టోబరులోనే చేయొచ్చు కదా? రోడ్ల సమస్య కొత్తది కాదు.. నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లినప్పుడూ చూశా.. ఎంతో దారుణంగా దెబ్బతిన్నాయి’ అని దుయ్యబట్టారు. ‘పాత పనులకే బకాయిలు చెల్లించలేదు, ఇప్పుడు చేసిన పనులకు డబ్బులెలా ఇస్తారనే సందేహాలు గుత్తేదారుల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబరు నుంచి పనులెలా మొదలవుతాయో చూద్దాం.. అయినా ప్రజల పక్షాన పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.
దిల్లీలో పవన్ కల్యాణ్