డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేసుకోవడం దుర్మర్గామని... తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సున్నా వడ్డీ రుణాలను ప్రారంభిస్తే... దానిని చంద్రబాబు పెద్దఎత్తున అమలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన వడ్డీ బకాయిలతో సహ 2,600 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు. దీనికి అదనంగా మరో 18,500 కోట్లు పసుపు కుంకుమ కింద తెదేపా ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇచ్చిందని తెలిపారు. తెదేపా ప్రభుత్వం మొత్తం 21,000 కోట్లు డ్వాక్రా మహిళలకు ఇచ్చిందని గుర్తుచేశారు.
డ్వాక్రా ఋణ మాఫీ 27వేల కోట్లను 4 విడతల్లో రద్దు చేస్తామని ఎన్నికల హామీలో పేర్కొన్న వైకాపా... కరోనా సాకుతో మొదటి విడత ఎగనామం పెట్టి డ్వాక్రా మహిళలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. మార్చి 2019 నాటికి 2,500 కోట్ల వరకు వడ్డీ రాయితీలు బ్యాంకులకు చెల్లించాల్సి ఉందన్నారు. అందులో 1400 కోట్లు మాత్రమే ఇచ్చి అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.