కొత్త ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఆయన స్థానంలో కొత్త ఎస్‌ఈసీ నియామకానికి ప్రభుత్వం ముగ్గురు పేర్లతో కూడిన దస్త్రాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు పంపించినట్లు తెలిసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారులు నీలం సాహ్ని, శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డిల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించినట్లు అధికార వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ పేర్లను అధికారికంగా ఎవరూ ధ్రువీకరించడం లేదు.
మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గత డిసెంబరు చివరన పదవీ విరమణ చేసి, ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. శామ్యూల్ ప్రభుత్వ సలహాదారుగా, నవరత్నాల అమలు కమిటీ వైస్‌ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ప్రేమచంద్రారెడ్డి ప్రస్తుతం సాధారణ పరిపాలన విభాగంలో ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి హోదాలో రాష్ట్ర విభజన సమస్యలకు సంబంధించిన అంశాలు చూస్తున్నారు. ప్రస్తుత ఎస్‌ఈసీ పదవీకాలం ముగుస్తుండటంతో... నిబంధనల ప్రకారం కొత్త ఎస్‌ఈసీ నియామకానికి పంచాయతీరాజ్‌శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దస్త్రం పంపింది. అక్కడి నుంచి అది ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లింది. సీఎం కార్యాలయమే విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లను నేరుగా గవర్నర్‌కు పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది.