ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతు రాజ్యం తీసుకొస్తానని రైతులేని రాజ్యం చేస్తున్నారు: లోకేశ్ - తెలుగు రైతుల అధ్యక్షుల ప్రమాణ స్వీకారం తాజా వార్తలు

ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకి పరిహారం చెల్లించకుంటే ఉద్యమ కార్యాచరణతో పోరాడతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. తడిసి దెబ్బతిన్న, రంగుమారిన పంటలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయటంతోపాటు ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

రైతు రాజ్యం తీసుకొస్తానని రైతులేని రాజ్యం చేస్తున్నారు:లోకేశ్
రైతు రాజ్యం తీసుకొస్తానని రైతులేని రాజ్యం చేస్తున్నారు:లోకేశ్

By

Published : Dec 10, 2020, 9:51 PM IST

పంట నష్టపోయిన రైతులకు హెక్టార్​కు 30 వేలు, ఉద్యాన పంటలకు 50వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలుగు రైతు అధ్యక్షులు, కార్యదర్శులతో లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఇటీవలే పదవులు పొందిన వీరు లోకేశ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో రైతు రాజ్యం తీసుకొస్తానన్న జగన్ రైతులేని రాజ్యం చేస్తున్న ద్రోహిగా మిగిలారని లోకేశ్ ధ్వజమెత్తారు.

అసెంబ్లీలో అసత్యాలు..

వైకాపా విధానాలతో ఏడాదిన్నరలో 496 మంది ఆత్మహత్య చేసుకున్నారని లోకేశ్ ఆరోపించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకపోవటం వల్లే నివర్ తుపాన్​లో తీవ్ర నష్టం వాటిల్లిందని విమర్శించారు. పంటల బీమా కట్టకుండా అసెంబ్లీలో అసత్యాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారని దుయ్యబట్టారు. ముందుగా ప్రీమియం చెల్లించి ఉంటే రైతులకు 4 వేల కోట్ల రూపాయల పరిహారం లభించేదన్నారు. 3వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అని గొప్పులు చెప్పి 524 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆక్షేపించారు.

ఏడాదిన్నరలో 1.30 లక్షల కోట్ల అప్పు

సున్నావడ్డీ పథకంలో రైతులను గణనీయంగా కుదించేసి అనేక విధాలుగా నష్టం చేకూర్చుతున్నారు. ఏడాదిన్నరలో 1.30లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 60 వేల కోట్ల రూపాయల ధరలు పెంచి ప్రజలపై భారం మోపారు. రైతులకు లాభం చేసే అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు. రైతులకు ఉరి వేసే మీటర్లు బిగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి.

- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి:ఏలూరులో వింతవ్యాధిపై పరిశోధనకు జాతీయ సంస్థలు

ABOUT THE AUTHOR

...view details