జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విధించిన షరతులు ఉల్లంఘించినందున..బెయిల్ రద్దు చేయాలని కోరారు. వైకాపా ప్రభుత్వంలో కీలకపాత్రలో ఉన్న విజయసాయిరెడ్డి..సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని వ్యాజ్యంలో రఘురామ ఆరోపించారు.
ఓ ఎంపీగా కేంద్ర హోం,ఆర్థికశాఖ మంత్రిత్వశాఖ కార్యాలయాల అధికారులను తరచూ కలిసే విజయసాయిరెడ్డి..తనకు కేంద్రమంత్రులతో సన్నిహత సంబంధాలున్నట్టుగా చిత్రీకరించి సాక్షుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భయం కలిగిస్తున్నారని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. ఎంపీ అవగానే..జగన్ అక్రమాస్తుల కేసుల ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అధికారిని...సీబీఐ జేడీ చేయవద్దని కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారని..ఇది విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో అశోక్‌ను జైలుకు పంపుతామని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం..కోర్టు ధిక్కరణే కాక, న్యాయవ్యవస్థపై ఆయన దృక్పథాన్ని తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు.