ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగాలు వేలల్లో... దరఖాస్తులు లక్షల్లో! - jagan

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కేటగిరీ-1 పోస్టులకు ఎక్కువ మంది పోటీపడుతున్నారు. మొత్తం మూడు కేటగిరీల కింద ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో రెండు, మూడు కేటగిరీలతో పోలిస్తే పెద్ద సంఖ్యలో వస్తోన్న దరఖాస్తులు కేటగిరీ-1 ఉద్యోగాలకే ఉంటున్నాయి. ఇప్పటివరకు వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో సగానికిపైగా దరఖాస్తులు ఈ కేటగిరీకి చెందినవే ఉంటున్నాయి.

Most_applications_for_village_and_ward_secretariat_category_posts

By

Published : Aug 7, 2019, 1:14 PM IST

ఉద్యోగాలు వేలల్లో...దరఖాస్తులు లక్షలు!

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు విశేష స్పందన వస్తోంది. వీటిల్లో కేటగిరీ-1 పోస్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో 60 శాతానికి పైగా ఈ కేటగిరిలోనే ఉన్నాయి. గడువు ముగిసే లోపు ఇదే కేటగిరిలో మరో ఐదు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

డిగ్రీ విద్యార్హతపై నాలుగు రకాలైన 36 వేల 449 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. వీటిల్లో పంచాయతీ కార్యదర్శి పోస్టులు 7,040.. మహిళా పోలీసులు 14,994.. సంక్షేమ విద్య సహాయకులు 11,158.. వార్డు పరిపాలన కార్యదర్శి 3,307 పోస్టులున్నాయి. మిగతా కేటగిరీల్లో టెక్నికల్ పోస్టులకు సంబంధిత డిప్లొమా తప్పనిసరి అన్న నిబంధనతో... అత్యధికులకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా... డిగ్రీ చేసిన వారంతా కేటగిరీ-1లోని పోస్టులపై మెుగ్గు చూపుతున్నారు.

పరీక్షల షెడ్యూల్ ఇలా..

సెప్టెంబరు ఒకటి, ఎనిమిది తేదీల్లో రెండు విడతల్లో నిర్వహించే రాత పరీక్ష ఫలితాలను 15 రోజుల్లోనూ ప్రకటించనున్నారు. ఈ మేరకు పరీక్షలు నిర్వహించేందుకు 13 ప్రభుత్వ భాగస్వామ్య శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. కేటగిరీ-1లో గల 5 రకాల పోస్టులకు ఒకటిన ఉదయం, రెండు, మూడు కేటగిరీల పోస్టులకు మధ్యాహ్నం రాత పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష లేదు..అర్హతలు పరిశీలించాకే...

తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో 7,966 ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించడం లేదు. విద్యుత్తు స్తంభం ఎక్కడం, మీటరు రీడింగ్‌ తీయడం, సైకిల్‌ తొక్కడం వంటివి నిర్వహించి వీటిలో ఎంపికైన వారందరి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి ఫలితాలు ప్రకంచనున్నారు. ఈ ప్రక్రియను వచ్చేనెల 16లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రకటించిన ఉద్యోగాలకు ఈనెల 10వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోర్టల్‌పై ఒత్తిడి పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అభ్యర్థులు గడవు చివరి రోజు వరకు వేచీ చూడొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details