Scam in Telugu Akademi: తెలుగు అకాడమీ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగానే.. ప్రధాన నిందితుడు, యూనియన్ బ్యాంకు కార్వాన్ బ్రాంచి మాజీ మేనేజర్ మస్తాన్ వలీని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ. 3 కోట్ల 98 లక్షల డిపాజిట్‌ను కొల్లగొట్టేందుకు యత్నించినట్లు మస్తాన్‌పై కేసు నమోదైంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన నగదును కార్వాన్‌లోని యూనియన్ బ్యాంకులో గతేడాది జనవరిలో రెండు వేర్వేరు డిపాజిట్లుగా చేశారు. ఆ సమయంలో మేనేజర్‌గా ఉన్న మస్తాన్ వలీ, ఏడాది వ్యవధికి డిపాజిట్లు చేసి నకిలీ రసీదులు ఇచ్చారు. అసలు పత్రాలను మాత్రం వెంకటరమణ అనే వ్యక్తికి ఇచ్చారు. కాలపరిమితి తీరడంతో గిడ్డంగుల సంస్థ ప్రతినిథులు రసీదులను తీసుకొని బ్యాంకుకు వెళ్లగా.. అధికారులు నకిలీవిగా తేల్చారు. డిపాజిట్ డబ్బులు మాత్రం బ్యాంకులోనే సురక్షితంగా ఉన్నాయి. దీంతో మోసానికి పాల్పడేందుకు కుట్ర పన్నిన మస్తాన్ వలీని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కాజేసిన సొమ్ముతో ఆస్తులు కొనుగోలు
తెలుగు అకాడమీకి చెందిన రూ. 43 కోట్లను కొల్లగొట్టిన కేసులోనూ మస్తాన్ వలీ ఇప్పటికే చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, మస్తాన్ వలీ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. ఇప్పుడు గిడ్డంగుల సంస్థ కేసులో మస్తాన్ వలీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తెలుగు అకాడమీ స్కాంలో నిందితుల నుంచి నగదు స్వాధీనం చేసుకున్నామని సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు. మస్తాన్‌వలీతో పాటు మరికొందరు.. కాజేసిన సొమ్ముతో ఆస్తులు కొన్నారని గజారావు భూపాల్ తెలిపారు. నిందితులు కొనుగోలు చేసిన ప్లాట్లు, భూములును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్థిరాస్తులకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని సంయుక్త సీపీ వివరించారు. ప్రభుత్వ సంస్థలు తమ ఎఫ్‌డీఐల గురించి బ్యాంకుల్లో తెలుసుకోవాలని సూచించారు.
"తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్లను కాజేసి వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. రూ. కోట్లలో కుంభకోణానికి పాల్పడ్డారు. ఆ సొమ్ముతో స్థిరాస్తులు కొన్నారు. రూ. 4 కోట్ల పైనే నగదు స్వాధీనం చేసుకున్నాం. ప్రధాన నిందితుడు మస్తాన్ వలీ వద్ద రూ. 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు కొన్న స్థిరాస్తులపై ఇంకా వివరాలు సేకరిస్తున్నాం."
గజారావు భూపాల్, సీసీఎస్ జాయింట్ సీపీ
తెలుగు అకాడమీ స్కాం ప్రధాన నిందితుడు.. ఆ కేసులోనూ అరెస్ట్.!