Modi tour in Bheemavaram: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తోంది. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అనంతరం భీమవరంలో జరిగే ప్రధాని మోదీ సభ జరగనుంది. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భీమవరం సమీపాన ఉన్న కాళ్ల మండలం పెదఅమిరంలో భారీ వేదిక సిద్ధమైంది. ఇదిలావుంటే భీమవరంలో వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లకు ఇబ్బందులు కలుగుతున్నాయి. సభా ప్రాంగణమంతా తడిసి ముద్దయింది. సభా ప్రాంగణంలో బురద లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సభా ప్రాంగణాన్ని రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు.
రాజు వేగేశ్న ఫౌండేషన్‌కు చెందిన 16 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మంది కూర్చునేందుకు టెంట్లు వేశారు. వేదికపై ప్రసంగాలను వీక్షించేందుకు గ్యాలరీలతోపాటు భీమవరం పట్టణ పరిసరాల వరకు ఎల్‌ఈడీ స్క్రీన్లు బిగించారు. ప్రాంగణానికి ఓ వైపు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. తోపులాటలు లేకుండా ప్రాంగణానికి వెళ్లేందుకు ప్రతి టెంటుకూ ఎదురుగా రెండు మార్గాలను ఏర్పాటు చేశారు. వీవీఐపీ, వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు.
- సభా ప్రాంగణానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో 4 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. ప్రముఖులు కూర్చునే వేదిక సిద్ధమైంది. మరో వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
జన సమీకరణకు 9 వేల బస్సులు..ప్రధాని సభకు ప్రజలను తీసుకొచ్చి, తిరిగి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2వేల బస్సులు ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు విద్యా సంస్థలు, ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన 7 వేల బస్సులను అల్లూరి సీతారామరాజు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తోంది. కోనసీమ నుంచి 2వేల వాహనాలు రానున్నాయి.