అప్పు తెచ్చి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయటం జగన్ అసమర్థతకు నిదర్శనమని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు విమర్శించారు. భవిష్యత్తు తరాల కోసం వినియోగించాల్సిన భూములు అమ్ముతూ రాష్ట్రాన్ని సోల్డ్ ఏపీగా మారుస్తున్నారని దుయ్యబట్టారు . పింఛను, రేషను కావాలంటే ప్రజలు ఉన్న ఆస్తులు అమ్ముకోవాలనే విధంగా ప్రభుత్వ తీరుందని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని దివాలా తీయించేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని శ్రీనివాసులు ధ్వజమెత్తారు. విశాఖ, గుంటూరుల్లో విలువైన భూములు సొంతవారికి విక్రయించేలా కుట్రపన్నారని ఆరోపించారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ స్థలాలను కారుచౌకగా సొంత పార్టీ నేతలకు కట్టబెడుతూ పేదలకు పనికిరాని భూములు కేటాయించటం దేనికి సంకేతమని నిలదీశారు. బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర పలికే విశాఖ పరిశ్రమల స్థాపన భూమి, గుంటూరులో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి ఉద్దేశించిన భూములను రిజర్వ్ ధరకంటే తక్కువగా పేర్కొని వేలం వేయటం కుట్రపూరితమేనని ఆరోపించారు.