విశాఖ మన్యంలో లేటరైట్ ఖనిజం మాటున బాక్సైట్ అక్రమ మైనింగ్‌కు (ILLEGAL BAUXITE MINING) వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నిందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు (MLC ASHOK BABU) ఆరోపించారు. ఆండ్రూ మినరల్స్ అనే మైనింగ్ సంస్థ 2018-19లో వైకాపాకు రూ. 11 కోట్లు విరాళం ఇచ్చినట్లు ఏడిఆర్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. లక్ష్మణరావు అనే గిరిజనుడు ద్వారా లేటరైట్ మైనింగ్‌కు అనుమతులిచ్చి.. కింద ఉన్న బాక్సైట్‌ను కూడా ఆండ్రూ మినరల్స్ సంస్థ ద్వారా వైకాపా పెద్దలు దోచుకునే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు.
తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్ చేసిన ఖనిజాన్ని డంప్ చేసి అక్కడి నుంచి కడప జిల్లాలోని సిమెంట్ కర్మాగారాలకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై మంత్రి సమాధానం ఇవ్వకుండా.. గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది (GOPALAKRISHNA DWIVEDI ) రాజకీయ నాయకుడిలా మాట్లాడారని.. తీవ్రంగా ఖండించారు. సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా మాట్లాడారని.. అందుకే ద్వివేదిపై డీవోపీటీ కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం జోక్యం చేసుకుని సమగ్ర విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని తాము కోరనున్నట్లు వెల్లడించారు.