రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలకు కేంద్రం ఇచ్చిన 1,250 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. జాతీయ హెల్త్ మిషన్, 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన మొత్తంలో జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది 950 కోట్లు మాత్రమేనని చెప్పారు. వాటిని ఖర్చు చేసిన తీరు కూడా అందరికీ తెలుసని విమర్శించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల వ్యవహారంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నరలో లక్షా 40 వేల కోట్ల రూపాయల అప్పునకు.. 70వేల కోట్ల పన్నుల భారాన్ని ప్రజలపై మోపారని మండిపడ్డారు. ప్రకటనలకే 160 కోట్లు ఖర్చు చేశారన్నారు. అయిదేళ్లలో జగన్ 7లక్షల కోట్ల వరకూ అప్పులు చేసి జైలుకెళ్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఊహించటమే కష్టంగా ఉందని ధ్వజమెత్తారు.