వాయుగుండం వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు పడ్డాయని, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలోనే పంట నష్టం జరిగిందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోందని వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన పంటనష్టాన్ని అంచనా వేస్తున్నట్టు చెప్పిన మంత్రి.. వర్షాలు తగ్గినా తరవాత పూర్తి అంచనా వేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ నష్టం జరగనివ్వమని అన్నారు. ఈ ఏడాది అనంతపురంలో సైతం అధిక వర్షపాతం నమోదైందని చెప్పిన మంత్రి.. వేరుశనగ పంటకు నష్టం వచ్చిందని, నిపుణుల కమిటీని అనంతపురానికి పంపుతున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో తక్కువ వర్షపాతాలు నమోదయ్యాయని మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఆ ప్రాంతాలపైనా.. దృష్టి పెట్టినట్టు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాకు వరుసగా పంట నష్ట పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.