కరోనా వల్ల సినీపరిశ్రమకు తలెత్తిన సమస్యలపైనా.. అలాగే ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ల రేట్ల సమస్యలపైనా చర్చించేందుకు ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పంపారు. మంత్రి పేర్ని నాని స్వయంగా చిరుకి ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో సీఎంకి విన్నవించాల్సిన అన్ని విషయాలపైనా కూలంకుశంగా చర్చించి వెళ్లాలన్న ఉద్దేశంతో ఇండస్ట్రీలోని పెద్దలతో హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సమావేశం జరిగింది.
చిరును కలిసిన సినీ దిగ్గజాలు..
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు నారాయణ దాస్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్. రామారావు, దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్ , సి. కళ్యాణ్, ఎన్వీ. ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ భోగవల్లి, బాబీ, యూవీ క్రియేషన్స్ విక్కీ - వంశీ ఇలా.. నిర్మాతల సంఘం.. పంపిణీ, ఎగ్జిబిషన్ రంగాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల ఏపీలో వచ్చిన జీవోలో ఉన్నవాటిపై చర్చించారు. సీఎంతో సమస్యల పరిష్కారానికి అవసరమైన మార్గాలేమిటి..? అన్నదానిపై చర్చించారు. అన్నిటినీ త్వరగా పరిష్కరించాలన్నది ప్రధాన డిమాండ్. చిన్న నిర్మాతల సమస్యలపైనా సీఎంతో భేటీలో చర్చించనున్నారు.