ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంక్రాంతి రుచులపై ధరాభారం.. 50% పైగా పెరిగిన సరకుల ఖర్చు

సంక్రాంతి అంటే పిండి వంటల పండగే. ముఖ్యంగా అరిసెలకు పెద్దపీట వేస్తారు. ఈసారి సరకుల ధరలు భయపెడుతుండటంతో వాటి వాసన వంటగది దాటడంలేదు. వేరుశనగ నూనె లీటరు రూ.150 పైగా ఉంది. పొద్దు తిరుగుడు(సన్‌ఫ్లవర్‌) నూనె లీటరు రూ.135కి చేరినా.. ఇంకా పైకే చూస్తోంది. పామోలిన్‌ మునుపెన్నడూ లేనివిధంగా లీటరుకు రూ.115 పలుకుతోంది. అరిసెల తయారీలో వాడే బెల్లం..  కిలో రూ.54 అయింది.

Massively increased essentials prices for sankranthi festival
కొండెక్కిన సంక్రాంతి సరకులు... 50%పైగా పెరిగిన వంటల ఖర్చు

By

Published : Jan 13, 2021, 7:20 AM IST

సంక్రాంతి వచ్చిందంటే ఇంటింటా వంటల సందడే. అరిసెలు, చక్కలు, చక్రాలు, లడ్డూలు, జంతికలు, గారెల ఘుమఘుమలు నోరు ఊరిస్తాయి. పల్లెలు, పట్టణాల్లో పండగకు వారం ముందు నుంచే వంటల హడావుడి మొదలవుతుంది. డబ్బాల్లో(15లీటర్లు) వంటనూనెలు, బుట్టల బెల్లం కొనేస్తారు. కనుమ రోజు పళ్లెంలో.. మాంసం ముక్క గంట కొట్టాల్సిందే. అయితే పేద, మధ్యతరగతి వర్గాలకు ఈ సంక్రాంతి భారంగా మారింది. పప్పులు నిప్పులయ్యాయి. వంటనూనెలు భగ్గుమంటున్నాయి. నాలుగేళ్లతో పోలిస్తే వివిధ రకాల సరకుల ధరలు 50%పైనే పెరిగి బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో పండగ సరకులకు రూ.2వేలు ఖర్చు చేసే కుటుంబాలు... ఈ ఏడాది రూ.3వేలకుపైగా వ్యయం చేయాల్సి వస్తోంది.

మార్చి వరకు ఇంతే...

ప్రస్తుతం వేరుసెనగ నూనె టోకున టన్ను రూ.1,35,000, పొద్దుతిరుగుడు నూనె రూ.1,25,000, పామోలిన్‌ రూ.1,10,000 చొప్పున పలుకుతున్నాయి. ప్యాకింగ్‌ తర్వాత చిల్లర విక్రయ దుకాణాల్లోకి చేరేసరికి మరింత పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో కూలీల సమస్య, తర్వాత వర్షాలతో ఉత్పత్తి దెబ్బతినడంతో... విదేశాల నుంచి దిగుమతులు మందగించాయి. ఉక్రెయిన్‌, మలేసియా దేశాల పరిశ్రమల్లో కొన్ని రోజులపాటు ఉత్పత్తిని నిలిపేయాల్సి వచ్చింది.

దిగుబడి తగ్గి.. ధరలు పెరిగి..

చైనా, పాకిస్తాన్‌, యూరోపియన్‌ దేశాల నుంచి వంటనూనెలకు డిమాండు పెరిగింది. మన దేశం నుంచి సైతం వేరుసెనగ, ఆముదం కొంటున్నాయి. మన దగ్గరా దిగుబడి పడిపోవడంతోపాటు ఇతర దేశాలకు ఎగుమతుల డిమాండు ఉండటంతో... వేరుసెనగ నూనె ధర పెరిగింది. మార్చి వరకు ధరలు తగ్గే అవకాశాలే లేవని వ్యాపారులు పేర్కొంటున్నారు. భారీవర్షాలతో పప్పుధాన్యాల దిగుబడులు తగ్గాయి. మినుము రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. రబీలో పప్పుధాన్యాల విస్తీర్ణం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొత్త పంట వచ్చాకే ధరలు తగ్గవచ్చని, మరో రెండు నెలలపాటు భారం భరించక తప్పదని వ్యాపారులు పేర్కొంటున్నారు.

గారెలతో సరిపెట్టుకుందామంటే.. మినపగుళ్లు కొండెక్కి కూర్చున్నాయి. కిలో రూ.117 పైకి చేరాయి. నాణ్యమైన రకాలకు రూ.140 పైన చెల్లించాల్సిందే. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే మినపగుళ్లు 57%, కందిపప్పు 51%, పెసరపప్పు 44% పెరిగాయి. సెనగపప్పుతో పిండి పట్టించి లడ్డూలు చేసుకుందామన్నా.. అదీ కిలో రూ.74 పలుకుతోంది. వేరుసెనగ గుళ్లు కిలో రూ.150కి చేరాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. గతంలో మాదిరిగా సంక్రాంతి రుచులను ఆస్వాదించలేకపోతున్నామని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

తెలుగు లోగిళ్లలో భోగి సందడి... ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువులు

ABOUT THE AUTHOR

...view details