తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా... లేకపోయినా ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. మహానాడు రెండో రోజు వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి మాత్రం వర్చువల్ మీడియా వేదికగా ఈ కార్యక్రమాన్ని జరపనున్నారు. ఒకేసారి 14వేల మందితో ఈ సారి మహానాడు ఆన్లైన్లో జరగనుంది.
ఈ నెల 27, 28 తేదీల్లో ఆరు గంటల్లో కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికలు చేశారు. 27న ఉదయం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యనేతల ప్రసంగాల అనంతరం తీర్మానాలు ప్రవేశపెడతారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 28న ఆయనకు నివాళులర్పించి, కార్యక్రమం కొనసాగిస్తారు.
ఆన్లైన్లో తెలంగాణ నుంచి దాదాపు 1500 మంది, ఎన్ఆర్ఐ విభాగం ఇతర దేశాల్లోని ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొంటారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, నాయకులకు చంద్రబాబు డిజిటల్ ఆహ్వానం పంపారు. ప్రతి కార్యకర్తా మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్‌లో జూమ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పంపిన లింక్‌ను ట్యాప్ చేసి స్క్రీన్ నేమ్ వద్ద పేరు, ‘జీమెయిల్’ వద్ద mahanadu@tdp.com అని టైప్ చేసి మహానాడులో చేరాలని పిలుపునిచ్చారు.
మొత్తం 13 తీర్మానాలు ఈసారి మహానాడులో ప్రవేశపెట్టనున్నారు. యుగపురుషునికి నివాళి తిర్మానాన్ని రెండు రాష్ట్రాలకు కలిపి చేయనుండగా... ఏపీకి 8, తెలంగాణకు 4 తీర్మానాలు విడివిడిగా చేయనున్నారు. ఇక మహానాడుకు అమరావతి ప్రాంతానికి ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. మొత్తం 29 సార్లు మహానాడు వేడుకను నిర్వహించగా... నాలుగు పర్యాయాలు అమరావతి వేదికైంది.