తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు... పార్టీ నేతలపై వరుసగా తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కరోనా సమయంలో ఏ ప్రభుత్వానికైనా ప్రధమ ప్రాధాన్యత ప్రజల ప్రాణాలు కాపాడటమే అవుతుందని, కానీ జగన్‌కు మాత్రం ప్రతిపక్షంపై కక్ష సాధించేందుకు, ప్రశ్నించే ప్రతిపక్షాన్ని కేసులతో బెదిరించి నోరు మూయించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఓ వైపు రోజుకి 18 గంటలు కర్ఫ్యూ పెట్టి, వేలాదిమంది పోలీసుల్ని తెదేపా నేతల్ని అరెస్టు చేసేందుకు వినియోగిస్తున్న ముఖ్యమంత్రికి... ప్రజలే బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.
జగన్ వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్న కొంతమంది పోలీసులు... భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని లోకేశ్ హెచ్చరించారు. ఎలాగైనా తెదేపా నేతల్ని అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని.. ఆయన అండగా చెలరేగిపోతున్న కొంతమంది పోలీసులు.. ఆయనతోపాటు జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కర్నూలులో ఎన్ 440 కె వైరస్ గురించి మాట్లాడి చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేశారని కేసు పెట్టిన పోలీసులు, అదే మాట మీడియా ముఖంగా మాట్లాడిన మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు పెట్టి, నోటీసులు ఇస్తున్నారా? అని లోకేశ్ నిలదీశారు. చట్టాన్ని చుట్టంగా చేసుకుని తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు పాల్పడతామంటే.. చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు.