Lokesh On Petrol Prices: దేశంలోనే అత్యధిక పెట్రో ధరలు ఏపీలోనే ఉన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. వైకాపా ప్రభుత్వం పెట్రోల్‌పై 30 శాతం వ్యాట్ విధిస్తోందన్న లోకేశ్.. పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్‌కు ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్‌పై 23 రాష్ట్రాలు పన్ను తగ్గించి ఊరటనిస్తే.. వైకాపా నుంచి స్పందన శూన్యమని మండిపడ్డారు. పెట్రో ధరలు తగ్గించకపోగా.. పెంచుకుంటే తప్పేంటంటూ కోట్ల రూపాయలతో సొంత పత్రికలకు ప్రకటనలు ఇచ్చుకోవడం జగన్‌కే చెల్లిందని ధ్వజమెత్తారు.
తెదేపా హయాంలో ప్రజలపై చమురు ధరల భారాన్ని తగ్గించడానికి 4 రూపాయల వ్యాట్ని 2 రూపాయలకి తగ్గించామని లోకేశ్ గుర్తు చేశారు. జగన్ మూడేళ్లలో ఒక్క పైసా తగ్గించడం మాట అటుంచి.. పెంచుకుంటూ పోయారని ఆక్షేపించారు. దీనికితోడు అదనపు వ్యాట్ అంటూ లీటర్ పెట్రోల్‌పై రూ.4, రోడ్డు సెస్ రూ.1 వేసి దేశంలోనే అత్యధిక ధరకు పెట్రోల్‌ను విక్రయిస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.
సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, తెలంగాణలో ధరలు తక్కువగా ఉండటంతో అక్కడికి వెళ్లి తమ వాహనాలను ఫుల్ ట్యాంకులు చేసుకుని వస్తున్నారన్నారు. పెట్రో భారం, వైకాపా దోపిడీ వల్ల రవాణారంగంపై ఆధారపడిన అన్నిరంగాలూ తీవ్ర నష్టాల్లోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మానవతా ధృక్పథంతో ప్రజలపై బాదుడే బాదుడుకి స్వస్తి చెప్పాలని లోకేశ్ హితవు పలికారు.